
సరస్వతీ నమస్తుభ్యం..
● పుష్కరాలకు జిల్లా నుంచి తరలివెళ్తున్న భక్తులు ● నదీస్నానం పుణ్యఫలమని నమ్మకం ● ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం
ఖమ్మంగాంధీచౌక్: సరస్వతీ పురష్కరాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈనెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోంది. ఈ త్రివేణీ సంగమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుండగా.. ఇక్కడ స్నానమాచరించిన భక్తులు పక్కనే ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.
నదీ స్నానాలకు ప్రాముఖ్యం
సరస్వతీ పుష్కరాల్లో నదీ స్నానాలకు భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పుష్కరస్నానం పుణ్యఫలమని, చదవుల తల్లిగా విరాజిల్లుతున్న సరస్వతీ నదిలో స్నానమాచరిస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయని వారి నమ్మకం. కాళేశ్వరంలో స్నాన ఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్నానానంతరం భక్తులు నదీ తీరంలో సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజలు చేయడంతో పాటు పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు.
వివిధ మార్గాల్లో పయనం..
జిల్లాలోని అన్ని ప్రాంతాల భక్తులు నిత్యం పుష్కరాలకు వెళ్తున్నారు. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో వరంగల్, పరకాల, భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వరకు 225 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఖమ్మం నుంచి మహబూబాబాద్, నర్సంపేట, మల్లంపల్లి, రేగొండ, భూపాలపల్లి, మహదేవ్‌పూర్ మీదుగా వెళితే 221 కి.మీ. ఉంటుంది. లేదంటే రైలులో ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాళేశ్వరం వెళ్లొచ్చు.
ట్రావెల్స్ చార్జీల మోత..
జిల్లా నుంచి కాళేశ్వరానికి నేరుగా బస్సుల సౌకర్యం అంతగా లేకపోవడంతో భక్తులు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కొందరు భక్తులు పుష్కరాలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, లక్నవరం, రామప్ప, వరంగల్ వేయి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి దేవాలయం వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరికి రవాణా చార్జీలు రూ.1,200 నుంచి రూ. 2,000 వరకు ఖర్చవుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు, సెలవులు కావడం, ఇప్పుడే పుష్కరాలు రావడంతో ప్రైవేట్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరల మోత మోగుతోంది.

సరస్వతీ నమస్తుభ్యం..