ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 10.30 గంటలకు వెంకటగిరి క్రాస్‌రోడ్డులో, 10.45 గంటలకు గాంధీచౌక్‌లో ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11 గంటలకు 2వ డివిజన్ పాండురంగాపురంలో స్ట్రోమ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. శనివారం రఘునాథపాలెం మండలం కోటపాడులో కోయచలక – పాపటపల్లి దారిలో బ్రిడ్జి నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
చట్టానికి లోబడి వ్యాపారం చేయాలి
జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య
బోనకల్: ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్లు చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య సూచించారు. బోనకల్‌లో గురువారం మధిర డివిజన్ డీలర్ల సమావేశం నిర్వహించగా డీఏఓ మాట్లాడారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని చెప్పారు. క్రమం తప్పకుండా లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేయడమే కాక పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీలర్లకు ఈపాస్ మిషన్లను అందించారు. కార్యక్రమంలో మధిర ఏడీఏ ఎస్.విజయచంద్ర, ఏఓలు వినయ్‌కుమార్, సాయిదీక్షత్, మానస, సాయిశివ, ఎస్‌ఐలు వెంకన్న, నాగుల్‌మీరా, లక్ష్మీ బార్గవి పాల్గొన్నారు.
స్పోర్ట్స్ అకాడమీల్లో
ప్రవేశాలకు తేదీల ఖరారు
ఖమ్మం స్పోర్ట్స్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వార్యాన కొనసాగుతున్న స్పోర్ట్స్ అకాడమీలు, రీజినల్ స్పోర్ట్స్ హాస్టళ్లలో ప్రవేశాలకు తేదీలను ఖరారు చేసినట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి టి.సునీల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1న సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలకు, 10, 11 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో సైక్లింగ్, రెజ్లింగ్ ఎంపికలు, హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్‌కు ఎంపికలు జరుగుతాయని వివరించారు. ఇక 10వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీకి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాలీబాల్ అకాడమీకి, 12న వనపర్తిలో హాకీ అకాడమీకి, ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీకి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 12, 13 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో వాలీబాల్ అకాడమీకి ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు ఆయా క్రీడాంశాల్లో జరిగే ఎంపికలకు నిర్ణీత తేదీల్లో వెళ్లాలని సూచించారు.
ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షలు ప్రారంభం
ఖమ్మం సహకారనగర్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 3,483 మంది విద్యార్థులకు గాను 3,268 మంది, మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 890 మందికి గాను 829 మంది హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. డీఈసీ, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను సందర్శించాయని, తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వివరించారు.
వృత్యంతర శిక్షణతో
ఉపాధ్యాయులకు మేలు
ఖమ్మం సహకారనగర్ : వృత్యంతర శిక్షణతో ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని స్టేట్ రిసోర్స్ పర్సన్, తెలుగు పర్యవేక్షకులు మడతా భాస్కర్ అన్నారు. నగరంలోని న్యూ ఇరా పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యా లక్ష్యాల సాధనకు ఈ శిక్షణ సరైందని అన్నారు. శిక్షణ కేంద్రం కో ఆర్డినేటర్ సీహెచ్.రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు పొత్తూరి సీతారామారావు, దేవయ్య, జంగం నాగేశ్వరరావు, జక్కంపూడి కృష్ణ, రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన


