
సదస్సులు లేవు.. చైతన్యం లేదు..
● ఊసే లేని ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ● రెండేళ్ల క్రితం వరకు ఏప్రిల్, మే నెలల్లో అవగాహన సదస్సులు ● ఈసారి మండలానికొక సదస్సుతో సరి
వైరారూరల్: పంటల సాగులో అవలంబించాల్సిన విధానాలు, విత్తనాల ఎంపిక జాగ్రత్తలు, సాగుకు ముందు చేయించాల్సిన భూపరీక్షలు ఇలా పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉమ్మడి ఆంధ్రపదేశ్‌గా ఉన్నప్పడు రైతు చైతన్య యాత్రలు నిర్వహించేవారు. తెలంగాణ ఏర్పడాక బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ పేరుతో రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఏటా వానాకాలం సాగుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో అవగాహన సదస్సులను నిర్వహించేది. కానీ గత రెండేళ్ల నుండి ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ఏటా సదస్సుల ఊసెత్తడం లేదు. దీంతోఆధునిక విధానాలపై అవగాహన లేక, ఏళ్లుగా ఒకే పంట సాగు చేస్తూ, అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతూ రైతులు నష్టపోవడం అనవాయితీగా మారింది.
అవగాహనలేమితో నష్టాలు
గ్రామాల వారీగా రైతుల వద్దకు వెళ్లి సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాక నష్టాలు తగ్గే అవకాశముంది. గతంలో సదస్సులు నిర్వహించినప్పుడు వ్యవసాయ అధికారుల బృందం ఉదయం 7గంటలకల్లా గ్రామాలకు వెళ్లి వివిధ అంశాలపై అవగాహన కల్పించడమే కాక రైతుల నుంచి సంతకాలు సేకరించేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు సమన్వయ సమితిల జాడ లేకపోగా, అవగాహన సదస్సుల విషయాన్నే మరిచిపోయారు. ఈ ఏడాది ‘రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ పేరిట ససదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ నిర్దేశిత ప్రాంతాల్లోనే ఏర్పాటుచేస్తుండడంతో రైతులకు సలహాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవగాహన కల్పించాలి..
రైతు చైతన్య యాత్రలు నిర్వహించకపోవడంతో అన్నదాతలకు అవగాహన లేక నష్టపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చైతన్య సదస్సులు ఏర్పాటుచేయాలి. సేంద్రియ వ్యవసాయంపైనా అవగాహన కల్పిస్తే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
– యమాల గోపాలరావు, సీపీఐ నాయకుడు
అమలు చేయాలి..
సాగుకు ముందు పంటలు, విత్తనాల రకాలపై అవగాహన లేకుండా పోయింది. ప్రభుత్వం, అధికారులు స్పందించి గతంలో మాదిరి చైతన్యయాత్రలు నిర్వహించి భూసార పరీక్షలు, ఇతర అంశాలపై వివరిం చాలి. దీంతో రైతులకు మేలు జరుగుతుంది.
– అయినాల కనకరత్నం, రైతు, కేజీ సిరిపురం

సదస్సులు లేవు.. చైతన్యం లేదు..

సదస్సులు లేవు.. చైతన్యం లేదు..