
ఎయిడ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ
● సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మంవైద్యవిభాగం: హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ను రూపుమాపేలా తీసుకోవాల్సిన చర్యలపై పటిష్ట కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తి, తద్వారా నష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. హైరిస్క్ ఉన్న వర్గాల్లో పెళ్లికి ముందు పరీక్షలు చేసుకునేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఆసక్తి ఉన్న వారితో వీడియోలు రూపొందించి గ్రామాల వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే, హెల్ప్‌లైన్ 1097 నంబర్‌పై విస్తృత ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. అంతేకాక బాధితులు తప్పనిసరి చికిత్స తీసుకునేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ పి.వెంకటరమణ, ఏఆర్‌టీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పి.మోహన్‌రావు, డేటా మేనేజర్ పి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు విత్తనాల విక్రయం
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సీజన్ సమీపిస్తున్నందున డీలర్లు విత్తన విక్రయాల్లో నింబధనలు తప్పక పాటించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో విత్తన విక్రయాలు, ఈ–పాస్ యంత్రాల వినియోగంపై నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యాన వ్యవసాయాధికారులు, డీలర్లకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాంతాల వారీగా డిమాండ్ మేరకు విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని, రైతులకు పూర్తి వివరాలతో రశీదు ఇవ్వడమే కాక నిల్వలపై రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. లైసెన్సు లేకుండా విక్రయించినా, రికార్డులు సరిగ్గా లేకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత సీజన్‌లో జిల్లాలో 100 మంది రైతులు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయినందున ఆ పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాభివృద్ధి అధికారి ఎం.వీ..మధుసూదన్, అధికారులు వాసవీరాణి, కొంగర వెంకటేశ్వరరావు, విజయచంద్ర, సరిత తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎరువుల విక్రయాల్లో వినియోగానికి ఎన్‌ఎఫ్‌ఎల్ కంపెనీ సమకూర్చిన ఈ–పాస్(ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లను కలెక్టర్ డీలర్లకు అందించారు. ఒక్కో యంత్రం విలువ రూ.20 వేల వరకు ఉండగా, జిల్లాలోని 700 మంది రిటైల్ డీలర్లకు అందించనున్నారు.