
నిర్మాణరంగంలో కుదుపులు
మధిర: భారీగా పెరిగిన ఇనుము, సిమెంట్, ఇసుక ధరలతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. సొంతింటి కల నెరవేర్చుకోవాలని పేద, మధ్యతరగతి ప్రజలు రూపాయి, రూపాయి కూడబెట్టేలోగా ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వారి కల నెరవేరే పరిస్థితి కానరావడం లేదు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నప్పటికీ వివిధ దశల్లో బిల్లులు మంజూరు చేయనుండడంతో ఆ పెట్టుబడి ఎలా సమకూర్చుకోవాలో తెలియక పేదలు సతమతమవుతున్నారు. ఫలితంగా నిర్మాణ రంగం నత్తనడకన సాగుతుండడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
సీజన్‌లోనే ౖపైపెకి...
సాధారణంగా సన్న, చిన్నకారు రైతులు, పేద ప్రజలు వ్యవసాయ పనులు పూర్తయ్యాక వేసవికాలంలో ఇళ్ల నిర్మాణం మొదలుపెడతారు. కానీ జనవరి నుంచి మార్చి వరకు తగ్గుతూ వచ్చిన సిమెంట్ ధర ఏప్రిల్‌కల్లా అమాంతం పెరిగింది. ఒక్కో సిమెంట్ బస్తా ధర కంపెనీల వారీగా రూ.350 నుంచి రూ.370.. కొన్నిసార్లు అంతకు మించి పలుకుతోంది. అలాగే, ఇనుము కూడా గత మూడు నెలలుగా తగ్గుతూ వచ్చి ఏప్రిల్ మొదటివారంలో భారీగా పెరిగింది. ఇక ట్రాక్టర్ ట్రక్కు ఇసుక ధర రూ.5 వేలకు పైగానే పలుకుతోంది. ఈనేపథ్యాన ఎక్కువ మంది ఇళ్ల నిర్మాణానికి వెనుకడుగు వేస్తుండగా, ఇంకొందరు మధ్యలోనే వదిలేస్తున్నారు. ఈ ప్రభావం మేసీ్త్రలు, కూలీలతో పాటు రాడ్ బెండింగ్, విద్యుత్, మార్బుల్, ప్లంబర్, పెయింటర్లు, కార్పెంటర్లు.. ఇలా అన్ని రంగాల కార్మికులపై పడుతోంది. ఇప్పటికే పెరిగిన సుతారీ మేసీ్త్రలు, కూలీల రేట్లు, ఇసుక ధరలతో పలువురు అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది చదరపు అడుగు నిర్మాణానికి రూ.3వేల వ్యయం కాగా, ఇప్పుడు అది రూ.3,500కు చేరడంతో అపార్ట్‌మెంట్లలో ప్లాట్ల అమ్మకం కూడా ముందుకు సాగడం లేదని బిల్డర్లు చెబుతున్నారు.
పని లేక ఇక్కట్లు
పెరిగిన ఇనుము, సిమెంట్ ధరలతో నిర్మాణరంగం నత్తనడకన సాగుతోంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వ్యాపారాలు సైతం పడిపోయాయి. ఒక్కో అద్దె చెల్లింపు, హమాలీలకు సరిపడా వ్యాపారం కూడా సాగడం లేదని చెబుతున్నారు. అలాగే, కార్మికులకు ప్రతిరోజు పనులు దొరకక పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.
భారీగా పెరిగిన ఇనుము, సిమెంట్ ధరలు
పేద, మధ్య తరగతికి దూరమవుతున్న సొంతింటి కల
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకూ
అవే ఇక్కట్లు
మరోపక్క ఉపాధి కోల్పోతున్న
నిర్మాణరంగ కార్మికులు
ధరల్లో పెరుగుదల ఇలా..
నెల సిమెంట్ ధర ఇనుము
ఒక్కో బస్తా టన్ను (రూ.ల్లో)
(రూ.ల్లో)
జనవరి 290 58,000
ఫిబ్రవరి 280 57,000
మార్చి 260 56,000
ఏప్రిల్ 350 69,000
మే 370 69,000
నిర్మాణాలు తగ్గిపోయాయి
ఇనుము, సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. గతంలో చేతినిండా పని ఉండేది. తాపీ మేసీ్త్రల కింద పని చేసేందుకు ఎందరు కూలీలు వచ్చినా సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు అందరికీ పని కల్పించలేక తరచుగా కొందరు కూలీలను వెనక్కి పంపాల్సి వస్తోంది.
– కత్తి జానయ్య,
పెద్ద తాపీ మేసీ్త్రల సంఘం అధ్యక్షులు, మధిర

నిర్మాణరంగంలో కుదుపులు

నిర్మాణరంగంలో కుదుపులు