
అత్యవసర సర్వీసులపై అవగాహన
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్‌సీకి ఇటీవల 108, 102 నియోనేటల్ అంబులెన్స్ సేవలు మంజూరయ్యాయి. ఆయా వాహనాల్లో ఉన్న అత్యాధునిక పరికరాల వినియోగంపై అత్యవసర సేవల జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సీహెచ్‌సీకి మంగళవారం వచ్చిన ఆయన అంబులెన్స్‌ల్లోని సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృపా ఉషశ్రీ ఉద్యోగులు దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులకు చికిత్స
దైవసేవతో సమానం
ఖమ్మంవైద్యవిభాగం: వయోవృద్ధులకు చికిత్స అందించడాన్ని దైవానికే సేవ చేసినట్లుగా భావించాలని డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని వయో వృద్ధుల కేర్ సెంటర్(పాలియేటివ్ కేర్ సెంటర్), కేన్సర్ వార్డులను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కేంద్రంలో ఉన్న వారి వివరాలు తెలుసుకున్నాక వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. జీవిత చరమాంకంలో ఉన్న వయోవృద్ధుల కోసం ఏర్పాటుచేసిన పాలియేటివ్ కేర్ సెంటర్‌తో మెరుగైన సేవలందించాలని సూచించారు. ఆతర్వాత డాక్టర్ ప్రేమలత, ఉద్యోగులతో మాట్లాడిన డీఎంహెచ్‌ఓ రికార్డులు పరిశీలించారు. అనంతరం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌లో పరీక్షల వివరాలు ఆరా తీశారు.
8,976 మందికి రూ.39.95కోట్ల బోనస్
1,60,853.040 మె.టన్నుల ధాన్యం కొనుగోళ్లు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఈ ఏడాది(2024–25) రబీ సీజన్‌లో ఇప్పటి వరకు రైతుల నుంచి 1,60,853.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 21,505 రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించారు. ఇందులో రూ.371.70కోట్లకు గాను రూ.309.82 కోట్ల బిల్లులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. గతేడాది రబీ సీజన్‌లో 21,884.360 మె.టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 1,60,853.040 మె.టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ వెల్లడించారు. అలాగే, సన్నధాన్యానికి ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటాకు రూ.500 చొప్పున 8,976మంది రైతులకు రూ.39.95కోట్ల బోనస్ జమ అయిందని తెలిపారు. మొత్తంగా సన్నధాన్యం 84,601.240 మె. టన్నులు సేకరించగా, 69,893.520 మె.టన్నుల ధాన్యానికి బోనస్ అందని వెల్లడించారు. ఇక కామన్ గ్రేడ్ ధాన్యం 71,706.040 మె. టన్నులు కొనుగోలు చేశామని డీసీఎస్‌ఓ వివరించారు. కాగా, జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు, మిల్లులను ఆయన మంగళవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.
మూడు నెలల బియ్యం ఒకేసారి
మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం వచ్చే నెలలో ఒకేసారి లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు డీసీఎస్‌ఓ చందన్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 748 రేషన్ షాప్‌లు, 4,11,202 కార్డులు ఉండగా, 11,30,169మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. వీరికి ప్రతీనెల 7,618.457 మె.టన్నుల బియ్యం అవసరం ఉండగా, సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీఎస్‌ఓ తెలిపారు.

అత్యవసర సర్వీసులపై అవగాహన

అత్యవసర సర్వీసులపై అవగాహన

అత్యవసర సర్వీసులపై అవగాహన