‘సహజీవనం’ జంట ఘర్షణ
ఖమ్మంఅర్బన్: భార్యాపిల్లలకు దూరంగా ఆయన, భర్తను వదిలేసిన ఈమె ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందో తెలియదు కానీ సదరు మహిళ చేతిలో ఆ వ్యక్తి హతమయ్యాడు. ఖమ్మం నేతాజీనగర్‌లో ఆదివా రం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా చింతలపుడి మండలం ప్రగడవరానికి చెందిన కోసన రవిప్రసాద్(53)కు భార్య, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. అదే జిల్లా సూరంపాలెంకు చెందిన లావణ్యకు ఓ కుమారుడు ఉండగా భర్తతో విడిపోయి కొన్నాళ్లుగా రవితో సహజీవనం చేస్తోంది. ఏడాదిన్నర పాటు సత్తుపల్లిలో ఉన్న ఈ జంట ఐదు నెలల క్రితం ఖమ్మం నేతాజీనగర్‌కు మకాం మార్చారు. రవిప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, లావణ్య టైలరింగ్‌తో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా లావణ్యను రవిప్రసాద్ తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. దీంతో ఆమె రవిని నెట్టివేయగా తల వెనుకభాగం గోడను బలంగా తాకిందని సమాచారం. ఆపై బనీన్‌ను ఒడిసి పట్టుకోవడంతో మెడకు బిగుసుకుని ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కింద పడగానే 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తలవెనక భాగం, నుదుటన గాయాలు ఉండడంతో ఖమ్మం అర్బన్ పోలీసులు లావణ్యను అదుపులోకి తీసుకుని మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, లావణ్యే ఉరి వేసి రవిప్రసాద్‌ను హతమార్చిందని ఆయన కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. కాగా, ఘర్షణ జరిగే క్రమాన నెట్టేసరికి గోడకు తగిలాక రవి కింద పడ్డాడని, అంతకు మించి ఏమీ జరగలేదని లావణ్య పోలీసులకు వివరించినట్లు తెలిసింది.
మహిళ చేతిలో వ్యక్తి హతం


