వేంసూరు: కనీస నిబంధనలు పాటించకుండా పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని పేర్కొంటూ కొందరు రైతులు హైకోర్టులో ఈనెల 2న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటీషన్ కాపీని బండి శ్రీనివాసరెడ్డి తదితరులు కల్లూరు ఆర్డీఓ కార్యాలయంతో పాటు వేంసూరు తహసీల్దార్ బాబ్జీప్రసాద్‌కు శుక్రవారం అందజేశారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ వేంసూరు మండలం కల్లురుగూడెంలోని 42 ఎకరాల్లో రూ.87 కోట్ల పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉగాది రోజున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి తదితరులు శంకుస్థాపన చేశారు. అయితే, ఫ్యాక్టరీ ఏర్పాటుతో గ్రామంలోని సామూహిక పట్టా భూమి కోల్పోవడమే కాక ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యంతో అనారోగ్యం పాలవుతామని, భూగర్భ జలాలు అడుగంటనున్నందున ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయించాలని పిటీషన్‌లో కోరినట్లు తెలిపారు. ఈమేరకు ఐదుగురు రైతులు పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
మెడిసిన్ విద్యార్థినికి చేయూత
కల్లూరు: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న మెడిసిన్ విద్యార్థినికి స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున చేయూతనందించారు. టేకులపల్లికి చెందిన శిరసాని ఇమ్మానియేల్ కుమార్తె ప్రీతి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసెన్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఆమె కుటుంబ పరిస్థితి బాగుండకపోవడంతో హాస్టల్ ఫీజు ఇతర అవసరాలకు ఇబ్బంది పడుతున్నట్లు స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన దాతల సాయంతో శుక్రవారం రూ.85 వేల చెక్కు అందచేశారు.
ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధర
ముదిగొండ: రైతులు తాము సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని, తద్వారా మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ముదిగొండ మండలం వల్లభి, మల్లారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వల్లభిలో సీ్త్ర టీ సెంటర్, మల్లారంలో సన్నబియ్యం పంపిణీని ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రమేష్‌బాబు, సీసీ రామారావుతో పాటు బిచ్చాల బిక్షం, ఇలవల పుల్లారెడ్డి, బిచ్చాల అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.
పార్క్‌లో మంటలపై అటవీశాఖ, పోలీసుల ఆరా
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ అటవీ పార్క్‌లో గురువారం రాత్రి మంటలు చెలరేగిన ఘటనపై శుక్రవారం అటవీశాఖ, పోలీసు అధికారులు ఆరా తీశారు. పార్క్‌ను ఆనుకుని ఉన్న పొలాల్లో రైతులు చెత్తకుప్పలకు నిప్పంటించడంతో మంటలు వచ్చాయా, ఇతర కారణాలు ఉన్నాయా అనే సమాచారం సేకరిస్తున్నారు. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ పార్క్‌ను పరిశీలించగా, అటవీశాఖ ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వరరావు కూడా మంటల ధాటితో ఎన్ని మొక్కలు కాలిపోయాయనే అంశంపై ఆరా తీశారు. మంటలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
పామాయిల్ ఫ్యాక్టరీపై హైకోర్టులో రిట్
పామాయిల్ ఫ్యాక్టరీపై హైకోర్టులో రిట్


