ముస్తాబవుతున్న పర్ణశాల | Sakshi
Sakshi News home page

ముస్తాబవుతున్న పర్ణశాల

Published Sat, Apr 13 2024 12:10 AM

చాందినీ వస్త్రాలతో ముస్తాబైన పర్ణశాల రామాలయం - Sakshi

దుమ్ముగూడెం: భద్రాలచం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మండలంలోని పర్ణశాల రామాలయంలో ఈ నెల 17న జరిగే శ్రీరామనవమి వేడుకలకు ఆలయ, పంచాయతీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు పర్ణశాలకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి సుందరంగా రంగులు వేశారు. ప్రధాన ఆలయం, గాలిగోపురం, ఉపాలయాలు, ప్రహరీ, పంచవటీ కుటీరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పంచవటీ కుటీరం గడ్డితో కప్పి అందంగా అలంకరించడంతో పాటు విగ్రహాలకు నూతన రంగులతో సుందరంగా తయారు చేశారు. కల్యాణం జరిగే మండపంతో పాటు దేవాలయం ప్రాంగణంలో చాందినీ వస్త్రాలతో ముస్తాబు చేస్తున్నారు. నవమి రోజున భద్రాచలం వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది పర్ణశాలకు కూడా వస్తుంటారు. దానికి అనుగుణంగా ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆలయంలో జరిగే శ్రీరామ కల్యాణ మహోత్సవానికి ఉభయ దాతల రుసుము రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఉభయ దాతల గోత్ర నామాలతో కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ప్రసాదంగా కండువా, జాకెట్‌ పీస్‌, పెద్దలడ్డూ, కల్యాణ అక్షింతలు అందజేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. భక్తులకు విక్రయించేందుకు దాదాపు 5 వేల లడ్డూలను భద్రాచలం దేవస్థానం నుంచి పర్ణశాలకు తీసుకొస్తున్నారు. భక్తులకు సరిపడా పులిహోర ప్రసాదం సిద్దం చేయనున్నారు. పులిహోర 200గ్రా. రూ.15, లడ్డూ ధర రూ.25గా నిర్ణయించారు.

పంచాయతీ ఆధ్వర్యంలో...

శ్రీరామనవమికి పర్ణశాల పంచాయతీ ఆధ్వర్యంలో పనులను వేగవంతం చేశారు. రామాలయ ఆవరణలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించే మండపం చుట్టూ పారిశుద్ధ్య పనుల నిర్వహణకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. పర్ణశాల గ్రామంలోని ఖాళీ ప్రదేశాలను గుర్తించి వాహనాలు పార్క్‌ చేసేందుకు అనువుగా స్థలాన్ని చదును చేస్తున్నారు. ఆలయ పరిసరాలను నాలుగు జోన్లుగా విభజించి మండలంలోని అన్ని జీపీలకు చెందిన 30 మంది కార్యదర్శులకు మూడు రోజుల పాటు విధులు కేటాయించారు. పారిశుద్ధ్య పనులకు 75 మంది కార్మికులను నియమిస్తున్నారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు ఆలయ పరిసరాలతో పాటు సీతమ్మ నార చీరల ప్రాంతంలో 4 తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు

సమన్వయంతో విజయవంతం చేస్తాం

కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం శ్రీరామ నవమికి పర్ణశాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. తాగునీరు, పారిశుద్ధ్య చర్యలతో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. గోదావరి తీర ప్రాంతంలో భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేస్తున్నాం. దేవస్థానం, పంచాయతీ అధికారుల సమన్వయంతో నవమి వేడుకలను విజయంవంతం చేస్తాం.

– ముత్యాలరావు, దుమ్ముగూడెం ఎంపీఓ

భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నాం. పర్ణశాలకు వచ్చే ప్రతీ భక్తుడు స్వామి వారి కల్యాణం కనులారా తిలకించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. కల్యాణం అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.

– అనిల్‌కుమార్‌, ఉత్సవాల ప్రత్యేకాఽధికారి

విద్యుద్దీపాలతో...
1/3

విద్యుద్దీపాలతో...

2/3

3/3

 
Advertisement
 
Advertisement