డ్యాంలో నీళ్లున్నా.. రైతులకు కన్నీళ్లు | - | Sakshi
Sakshi News home page

డ్యాంలో నీళ్లున్నా.. రైతులకు కన్నీళ్లు

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

ట్రాక్టర్‌లో వరినారు తరలిస్తున్న దృశ్యం

వర్షాభావంతో బీడుగా మారిన ఆయకట్టు

అక్కడక్కడ వేసిన వరినాట్లు

సాక్షి, బళ్లారి: ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్‌ సీజన్‌లో ముందుగా సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. రైతులు పూర్తిగా నష్టపోయి, కరువు కొరల్లో చిక్కుకున్నారు. పంటల సాగుకు చేసిన అప్పులతో విలవిల్లాడిపోతున్నారు. తుంగభద్ర డ్యాంలోకి ఎట్టకేలకు ఆలస్యంగా నీరు చేరింది. ఆగస్టు 11 నుంచి కాలువలకు నీరు వదిలారు. రైతులు సంతోషంగా వరినాట్లు వేయడానికి సిద్ధమయ్యారు. ముందుగా వరినారు పోసుకుని దుక్కులు చేసుకున్న రైతుల వరినాట్లు వేయడంపై దృష్టి పెట్టారు. అయితే వర్షాల జాడ లేకపోవడం, ఎల్‌నీనో తీవ్ర ప్రభావం చూపడంతో వరినాట్లు మందకొడిగా సాగుతున్నాయి. సాధారణంగా వరినాట్లు వేసే సమయంలో వర్షాలు కురిస్తే వేగవంతంగా మడులు సిద్ధం చేసేందుకు వీలవుతుంది. కాలువల ద్వారా వచ్చిన నీటితో వరినాట్లు జోరుగా సాగవని రైతులు చెబుతున్నారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ జిల్లాలో 15 లక్షల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇందులో సగానికి పైగా వరి పంట సాగవుతుంది. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నేపథ్యంలో వరి పంటపై ఆశలు వదులుకునే పరిస్థితి ఉందని అన్నదాతులు ఆవేదన చెందుతున్నారు.

డ్యాంలో 96 టీఎంసీల నీరు

డ్యాంలో 96 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఖరీఫ్‌లో పంటల సాగుకు 80 టీఎంసీలు ఉంటే సరిపోతాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. అయితే రైతులు పంటలు సాగు చేసుకునేందుకు తగినంత నీరు సరఫరా చేస్తారా లేదా అనే సందేహం నెలకొంది.

వరినాట్లు వేసినా ప్రయోజనం శూన్యం

వరినారు పోసుకుని రెండు నెలలు గడుస్తున్నా.. నాట్లు వేసేందుకు సాధ్యం కావడం లేదు. ఈసారి 40 శాతం కూడా వరినాట్లు వేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో తుంగభద్ర ఆయకట్టు కింద హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువ కింద పంటలు వేయడానికి నీరు విడుదల చేయలేదని అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో పంటలకు నీరు వదలకపోతే కర్ణాటక పరిధిలోని రైతులకు కూడా నీరు సక్రమంగా చేరే పరిస్థితి ఉండదు. కాలువల్లో నీరు తక్కువగా వస్తే అన్ని డిస్టిబ్యూటరీలకు నీరు చేరే అవకాశం ఉండదు. వరినాట్లు వేసినా పంట చేతికి అందే పరిస్థితి ఉండదు. కొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడి వరినాట్లు వేశారు. మిగిలిన ఆయకట్టు బీడుగా దర్శనమిస్తోంది. – మాధవ రెడ్డి, రైతు సంఘం నేత

మందకొడిగా సాగుతున్న వరినాట్లు

డోలాయమానంలో ఆయకట్టు రైతులు

నీటి విడుదలపై సందేహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement