రాయచూరు రూరల్: ప్రేమించిన అమ్మాయి దూరం అవుతోందనే కారణంతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటా అని హల్‌చల్ చేశాడు. ఈ ఘటన దేవదుర్గ పట్టణంలో కలకలం సృష్టించింది. వివరాలు ఇలా.. కొప్పళ జిల్లా దేవగుర్గకు రాజు, మల్లమ్మ గతంలో బెంగళూరులో ఉన్న సమయంలో ప్రేమించుకున్నారు. ఇటీవల మల్లమ్మ.. రాజును దూరం పెట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం సెల్ టవర్ ఎక్కి దూకేస్తానంటూ హంగామా చేశాడు. ‘నా మరణానికి మల్లమ్మే కారణం అంటూ డెత్ నోట్ రాశాడు. కిందకు దిగాలని స్థానికులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న దేవదుర్గ తహసీల్దార్ నాగమ్మ, సీఐ మంజునాథ్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడిని కిందకు దించేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చాకచక్యంగా వ్యహరించిన అధికారులు మల్లమ్మను పిలిపించారు. మల్లమ్మ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో రాజు కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
రాయచూరు రూరల్: గడిచిన 11 రోజుల్లోనే జిల్లాలో వరుసగా నాలుగు అనుమానాస్పద మరణాలు చోటుచేసుకున్నాయి. లింగసూగూరు తాలూకా కరకడకల్‌లో రాణెమ్మ, హద్దనాళలో భూమానంద, హోక్రాణి గ్రామంలో అశ్విని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం అలెమారి బుడకట్టు సమాజం మండళి అధ్యక్షుడు ఎన్.మూర్తి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పరిహారం, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. బాధిత కుటంబాల్లోని విద్యార్థులకు హాస్టల్‌లో సౌలభ్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.
హావేరివాసి దుర్మరణం
హిందూపురం టౌన్: సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపురం–పెనుకొండ రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడి ఒకరు చనిపోయారు. హిందూపూరం రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పరిశీలించారు. సుమారు 25–30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో అక్కడే చనిపోయాడని తెలిపారు. తలకు తీవ్ర గాయం కావడంతో పాటు శరీరంపై పలు గాయాలు ఉన్నాయి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడు కర్ణాటక రాష్ట్రం హావేరి తాలుకా బసాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ చావడిగా గుర్తించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
హాస్య నటుడు
చిక్కన్న పెళ్లివేడుక
మైసూరు: కన్నడ కామెడీ కింగ్‌గా పేరుగాంచిన శాండల్‌వుడ్ హాస్య నటుడు చిక్కన్న, ఆదివారం వ్యాపారవేత్త పావనిగౌడ పెళ్లి ఘనంగా జరిగింది. సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో చిక్కన్న అచ్చమైన మైసూరు అల్లునిలా మెరిసిపోయారు. శ్రీరంగపట్నంలోని మహాదేవపుర పావని గౌడ స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక జరిగింది. మైసూరులోని స్పెక్ట్రమ్ హాల్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఉపేంద్ర, గోల్డెన్ స్టార్ గణేశ్ సహా శాండల్‌వుడ్ సెలబ్రిటీలు విచ్చేశారు. నాకు పైళ్లె ఎన్నో ఏళ్లు అయ్యింది, కానీ నాకేమీ తెలియదు, కాబట్టి మీకేమీ సలహా ఇవ్వలేను అని గణేశ్ జోక్ చేయడంతో అందరూ నవ్వారు. సహనం సంసారానికి చాలా ముఖ్యమని నటి సుధారాణి సూచించారు.
నాగేంద్ర రాజీనామా
ఆమోదం
యశవంతపుర: వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి నిధుల కుంభకోణం కేసులో మంత్రి నాగేంద్ర రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. సీఎం డీకే శివకుమార్, సీఎస్ శాలిని రజనీష్‌కి ఈ మేరకు సమాచారం పంపారు. ఈ స్కాం వల్ల ఆయన రెండవసారి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు నాగేంద్రకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయడంలో జేడీఎస్‌తో ఎలాంటి అపోహలు లేవని బీజేపీ నేత విజయేంద్ర తెలిపారు. 1వ తేదీ నుంచి రాయచూరు నుంచి పాదయాత్ర చేపడతామని బీజేపీ నేతలు ప్రకటించారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై
లాఠీచార్జ్
బనశంకరి: యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం నగరంలో మల్లేశ్వరంలోని బీజేపీ ప్రదాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వివాదం జరిగింది. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోవడంతో పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జ్‌చేసి చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.


