మైసూరు: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా వేడుకల కోసం విచ్చేసిన గజరాజుల బరువు తూచే ప్రక్రియ ఆదివారం కోలాహలంగా సాగింది. 5కు పైగా టన్నులతో గజరాజు శ్రీకాంత్ అగ్రగామిగా నిలిచింది. ఐదురోజుల కిందట అడవి నుంచి రాచ నగరానికి వచ్చి, అంబావిలాస్ ప్యాలెస్ ప్రాంగణంలో విడిది చేసిన 9 ఏనుగులకు ఆదివారం తూకం వేసి బరువు కొలిచారు.
గజ గమనం ఇలా..
ప్యాలెస్ షెడ్ల నుంచి ధన్వంతరి రోడ్డులోని సాయిరామ్ కంపెనీ తూనిక కేంద్రానికి తీసుకువచ్చారు. పోలీసులు, అటవీ సిబ్బంది భద్రత మధ్య ఏనుగులు వరుసగా నడుస్తూ ఉండగా, జనం, టూరిస్టులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు. తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు. కొందరు ఏనుగులు గణేశుని రూపం అని భావించి, భక్తితో నమస్కరించి వాటికి పువ్వులు సమర్పించారు.
రీళ్లు, వీడియోలు తీయొద్దు
బరువు తూచిన తర్వాత, ఏనుగులను అదే దారిలో ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. రాజారూర్ రాజబేడిలో గజాలకు దసరా శిక్షణ ప్రారంభమైంది. దసరా ఏనుగుల ముందు ఎవరైనా రీళ్లు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయరాదని, అలా చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్యాలెస్‌లో ఏనుగులను చూడడానికి ఉన్న ఫీజును ఈసారి తొలగించారు. ఏనుగులు బలంగా ఉన్నాయి, శిక్షణ తరువాత జంబూసవారీని మోసే కెప్టెన్‌ను ఎంపిక చేస్తామని డీసీఎఫ్ ప్రభుగౌడ విలేకరులతో చెప్పారు. కాగా ఏనుగులు నగరంలో పుష్టిగా ఆహారం తిని, తిరిగి వెళ్లే వేళకు బరువు పెరిగి ఉంటాయి.
తూకం పరీక్షల కోసం వరుసగా నడిచి వెళ్తున్న ఏనుగులు
గజరాజులను వీక్షిస్తున్న జనసందోహం
5.7 టన్నులతో అగ్రస్థానం
మైసూరు దసరా ఏనుగుల బరువు లెక్కింపు
ప్యాలెస్ సిటీలో కొత్త సందడి
పర్యాటకులకు కనువిందు


