● యువతి దుర్మరణం
కృష్ణరాజపురం: బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఒక కో–లివింగ్ పీజీ హాస్టల్ భవనం 7వ అంతస్తు నుంచి ప్రేమికుల జంట దూకడంతో, యువతి అక్కడికక్కడే మరణించగా, యువకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఈసీసీ రోడ్డులోని మౌంటెన్ కో–లివింగ్ పీజీలో జరిగింది. మృతురాలు పుదుచ్చేరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జనని (23), ఆమె ప్రియుడు మాణిక్య వేలు (30). అతడు తమిళనాడువాసిగా సమాచారం. ఇద్దరూ ఓ ప్రైవేటు కంపెనీలో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. ప్రేమించుకుంటూ కో లివింగ్ హాస్టల్‌లో ఒకే గదిలో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరనే భయమో, లేదా ఏం గొడవలు వచ్చాయో గానీ ఆదివారం హాస్టల్ భవనంలోని 7వ అంతస్తు నుంచి దూకడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. యువతి క్షణాల్లో చనిపోగా, అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
వీధిలైట్ల దుస్థితిపై మంత్రి ఆవేదన
బనశంకరి: గ్రేటర్ బెంగళూరులో వీధి దీపాల నిర్వహణ గురించి రెండుసార్లు సమావేశం నిర్వహించినప్పటికీ ఫలితం లేదు, ప్రముఖ రోడ్లలో విద్యుత్ దీపాలు పనిచేయడం లేదు, అలసత్వం చూపే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రి కృష్ణబైరేగౌడ సూచించారు. ఆదివారం ఆయన ట్వీట్ చేవారు. 28 సాయంత్రం హడ్సన్ సర్కిల్ నుంచి చాళుక్య సర్కిల్ వరకు తాను పరిశీలించగా 140 విద్యుత్ స్థంభాల్లో లైట్లు పనిచేయడం లేదన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
పీడీఓ దంపతుల ఇంట్లో
రూ.1.43 కోట్ల చోరీ
● శివమొగ్గలో ఘటన
శివమొగ్గ: నగరంలోని విద్యానగర 4వ క్రాస్ రోడ్డులో ఒక పీడీఓ కుటుంబం నివసిస్తున్న అద్దె ఇంట్లో భారీ చోరీ జరిగింది. 943 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి, రూ.86 వేల నగదు, 15 వాచీలు, ఒక దేవుని విగ్రహం, మొత్తం రూ 1.43 కోట్ల సొత్తును ఎత్తుకెళ్లారు. పీడీఓ నటరాజ్ కె.ఎన్. (55), ఆయన భార్య ఇద్దరూ పీడీఓలుగా పని చేస్తున్నారు. ఆగస్టు 28న ఉయదం 11:15 గంటలకు ఇద్దరూ ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లారు. కొంతసేపటికే దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చొరబడ్డారు. బంగారు నగలు, వెండి సొత్తు, డబ్బులు, విలువైన వాచ్‌లు తదితరాలను మూటగట్టుకెళ్లారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీ కెమెరాలలో దొంగలు నమోదయ్యారు. కోటే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మాణిక్య వేలు టెక్కీ జనని (ఫైల్)
సీసీ కెమెరాలో దొంగలు


