దొడ్డబళ్లాపురం: పై అధికారులు ప్రమోషన్ ఇస్తానని నమ్మించి రూ.50 వేలు లంచం తీసుకుని మోసం చేయడంతో ఆవేదనకు గురైన బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా మాదనబావి గ్రామంలో జరిగింది. వివరాలు.. ఐడీఎఫ్‌సీ బ్యాంకులో మోహన్‌కుమార్ చిన్న ఉద్యోగి. నీకు ప్రమోషన్ ఇప్పిస్తామని, ఇందుకు నకిలీ మార్కుల కార్డును తయారు చేయించాలని రూ.50 వేలు లంచం అడిగారు. మోహన్‌కుమార్ అప్పులు చేసి అధికారులకు ఆ డబ్బు ఇచ్చాడు. కానీ ఎన్నిరోజులైనా ప్రమోషన్ రాలేదు, అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని బాధపడ్డాడు. బ్యాంకులో పని చేసే తిప్పేస్వామి, బోగస్ మార్కుల లిస్టు చేసిచ్చిన కోట్రేశ్ కారణమని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసి బైక్‌తో పాటు తుంగానది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యామతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కరెంటు తీగ మీద పడి..
మైసూరు: మైసూరు జిల్లాలోని తి.నరసిపుర తాలూకాలోని బొమ్మనాయకనహళ్లి గ్రామంలో కరెంటు షాక్ తగిలి మంజు (43) అనే రైతు మరణించాడు. అతను తన ఇంటి దగ్గర ఉన్న చెరకు పొలానికి వెళ్తుండగా, ఒక విద్యుత్ తీగ తెగి అతనిపై పడటంతో తలకు తీవ్ర గాయాలై పడిపోయాడు. చాలాసేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా మంజు మృతదేహం కనిపించింది. బన్నూర్ సీఈఎస్‌సీ ఇంజనీర్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఘోరానికి కారణమని గ్రామస్తులు ఆరోపించారు.
డేటింగ్ అంటూ కిడ్నాప్
● రూ.3.7 లక్షల దోపిడీ
● కిలాడీ ముఠా అకృత్యం
బొమ్మనహళ్లి: యువతితో సంతోషంగా గడపాలని అనుకున్న వ్యక్తికి నరకం చూపించారు. బెంగళూరు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి ఒక వ్యక్తిని అపహరించి, రూ. 3.7 లక్షలను దోచుకుంది. వివరాలు.. ఆనేకల్ తాలూకాలోని చందాపుర ప్రైవేట్ ఉద్యోగి (33), కొన్ని నెలలుగా డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇటీవల పూనమ్ అనే యువతిని కలిశాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ, చాటింగ్ చేసేవారు. ఆగస్టు 19వ తేదీ రాత్రి, ఎలక్ట్రానిక్స్ సిటీలోని హులిమంగళ మెయిన్ రోడ్డులో ఉన్న ఒక పబ్ దగ్గరకు రావాలని యువతి ఆహ్వానించింది. రాత్రి 9:45 గంటలకు అతడు వెళ్లగా, కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. ఆ సమయంలో, నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వ్యక్తిని బెదిరించి, అదే కారులో బలవంతంగా తీసుకుపోయారు. తర్వాత అతడిని మరో బూడిద రంగు కారులోకి మార్చి, నగరంలో తిప్పుతూ చంపేస్తామని బెదిరించి జేబులోని నగదు, డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి రూ.3.7 లక్షలను దోచుకున్నారు. వారి నుంచి ఎలాగో బయటపడి ఆగస్టు 25న హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సీఎం వేధించారు: హొరట్టి
దొడ్డబళ్లాపురం: తనను వేధించి, హింసించి మరీ రాజీనామా తీసుకున్నారని విధాన పరిషత్ మాజీ స్పీకర్ బసవరాజు హొరట్టి ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఆరోపణలు చేశారు. గదగ్ జిల్లా శిరహట్టి తాలూకా బెళ్లట్టి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీకే శివకుమార్ తనను చాలా వేధించి రాజీనామా చేయించారన్నారు. సీఎం సుమారు గంటన్నరపాటు తన కార్యాలయంలో కూర్చొని ఒత్తిడి తీసుకువచ్చారని, అప్పుడు తాను చాలా బాధపడ్డానని అన్నారు.
సర్వీసింగ్ తరువాత కారు దగ్ధం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో జాతీయ రహదారి–44పై నెరలూరు వద్ద కారు మంటల్లో కాలిపోయింది. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం అత్తిబెలెవాసి మోహన్, కారుకు సర్వీసింగ్ చేయించిన తర్వాత దానిని ట్రయల్ చూడటానికి వెళ్తుండగా తెల్లని పొగలు, మంటలు లేచి నిమిషాల్లోనే దగ్ధమైంది. దీంతో యజమాని షాక్‌కు గురయ్యాడు. గంటకు పైగా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది. అత్తిబెలె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.


