మండ్య: జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మేలుకోటె దేవస్థానంలో శ్రావణమాసం ముగుస్తోండగా భక్తజనం తరలివస్తున్నారు. శని, ఆదివారాల్లో, 50 వేల మందికి పైగా భక్తులు చెలువనారాయణస్వామి, యోగ నరసింహస్వామి ఆలయాలను సందర్శించారు. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయేవరకూ దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తుల వాహనాలతో పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోయాయి. చాలా దూరంలోనే కార్లను నిలిపి నడుచుకుంటూ వచ్చారు. అన్నదాన భవన్‌లో భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. వివిధ గ్రామాల నుంచి దాతలు ట్రాక్టర్లలో ఆహారాన్ని తీసుకువచ్చి భక్తులకు వితరణ చేశారు. ఈఓ శీలా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పూలహారాలు కరువాయె
శ్రావణమాసం సందడి ఆలయంలో కనబడడం లేదని భక్తులు వాపోయారు. ఆలయంలో విగ్రహాలకు, ద్వారాలకు కనీస పూలమాలలు, పందిర్లు కూడా కట్టలేదు. మూలవిరాట్లకు కూడా పూలదండలు, తోమలే సేవలు లేవని భక్తులు నిట్టూర్చారు. గోపురం, ద్వారాలకు పూలమాలలు కట్టాలని ఈఓకి సూచించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తనకెవరూ చెప్పనందున పూలహారాల అలంకరణ చేయలేదని ఈఓ శీలా పేర్కొన్నారు.
శ్రావణం, వీకెండ్ రద్దీ


