● ఇక్కడి నుంచే పరిపాలన: సీఎం
శివాజీనగర: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధికారిక నివాస బంగ్లా కృష్ణాలో అడుగుపెట్టారు. బుధవారం కుమార పార్కులో ఉన్న కృష్ణాలో అజ్జయ్య స్వామి చిత్రంతో ప్రత్యేక పూజలు చేసి ప్రవేశించారు. కృష్ణాలో సీనియర్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఇకపై కృష్ణా నివాసం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తానని, ప్రజల విజ్ఞప్తులు ఇచ్చేందుకు ఇక్కడికే రావాలని డీకే తెలిపారు. ప్రజల సంక్షేమం, పాలనలో వేగం కోసం కృష్ణా నుంచి పాలన సాగిస్తానన్నారు.
కేబినెట్ విస్తరణపై సూచన
బనశంకరి: సీఎం డీకే మంత్రివర్గ విస్తరణపై 27న ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. మంత్రి పదవుల కోసం లాబీయింగ్‌కు అవకాశం ఇవ్వరాదని డీకేకు హైకమాండ్ నేతలు ఫోన్ చేసి సూచించారని తెలిసింది. కుర్చీల కోసం అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి పైరవీలు సాగిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభిమానులతో ర్యాలీలు చేయిస్తున్నారు. తమ వర్గం స్వాములు, మఠాధిపతుల ద్వారా ప్రకటనలు చేయిస్తూ ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. ఇవి సరికాదని, అన్నీ పరిశీలించి విస్తరణ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది.
శివమొగ్గ కోర్టుకు
బాంబు బెదిరింపు
శివమొగ్గ: రాష్ట్రంలో న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కొనసాగుతున్నాయి. బుధవారం శివమొగ్గ కోర్టుకు ఇలాంటి మెయిల్ వచ్చింది. జయనగర స్టేషన్ పోలీసులు కోర్టు ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు ఈ–మెయిల్ ఒకటి శివమొగ్గ ప్రధాన జిల్లా సెషన్స్ జడ్జి (పీడీజీ)కు వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా జాగిలాలతో క్షుణ్ణంగా సోదాలు చేయగా ఎలాంటి పేలుడు వస్తువులు దొరకలేదు. ముందు జాగ్రత్త గా కోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను బంద్ చేసి పరీక్షించారు. కోర్టుకు వచ్చిన వ్యక్తులను సోదాలు చేశారు. చివరికి ఉత్తుత్తి బెదిరింపుగా తేల్చారు. దీనివల్ల గంటలకొద్దీ కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి.
28 నుంచి పల్స్ పోలియో
మైసూరు: ఐదేళ్ల లోపు బాలలకు పల్స్ పోలియో ద్వారా చుక్కల మందు వేయించాలని జిల్లాధికారి జీ.లక్ష్మీకాంతరెడ్డి సూచించారు. బుధవారం నగరంలోని జెడ్పీ సభాంగణంలో పల్స్ పోలియో ఏర్పాట్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పల్స్ పోలియోను నూటికి నూరుశాతం విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 28న ఆదివారం పల్స్‌పోలియో కేంద్రాల్లో చుక్కలు వేస్తారన్నారు. 29 నుంచి జూలై 1 వరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఐదేళ్ల లోపు ప్రతి ఒక్క శిశువుకూ పోలియో చుక్కలను వేస్తారని తెలిపారు. జిల్లాలో మొత్తం 7,78,059 ఇళ్లకు వెళ్లి చుక్కలు వేయాలని సూచించారు. ఎస్పీ మల్లికార్జున బాలదండి, పల్స్ పోలియో అమలు అధికారి డాక్టర్ సిరాజ్ అహ్మద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్తంభాల వ్యాన్ బోల్తా
● ముగ్గురు కూలీల మృతి
దొడ్డబళ్లాపురం: టెంపో బోల్తా పడ్డ ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన సంఘటన బుధవారం తెల్లవారుజామున బెళగావి సిటీ కిత్తూరు వద్ద పూణె–బెంగళూరు హైవేలో జరిగింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆదిల్‌ఖాన్ (26), పవన్ (26), నజీర్ ఖాన్ (25) స్తంభాల కింద చిక్కి ప్రాణాలు విడిచారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. అందరూ కూడా యూపీలోని ఉన్నావ్ జిల్లాకు చెందినవారు. ఓ కాంట్రాక్టరు వద్ద పనిచేసేవారు. వ్యాన్‌లో స్తంభాలను తీసుకెళ్తుండగా డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


