నేడు టీబీ డ్యాం కొత్త గేట్ల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు టీబీ డ్యాం కొత్త గేట్ల ప్రారంభం

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగు నీరందించే తుంగభద్ర (టీబీ) జలాశయం నూతన గేట్ల అమరిక పూర్తయింది. రూ. 51 కోట్ల నిధులతో 33 కొత్త గేట్లు అమర్చారు. గురువారం జరిగే కార్యక్రమంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొని కొత్త గేట్లను ప్రారంభిస్తారు. డ్యాం వద్ద కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన గేట్ల వల్ల డ్యామ్‌ ఆయుష్షు మరో 50 ఏళ్లు పెరిగినట్లు ఇంజనీర్లు తెలిపారు. 2024 ఆగస్టులో డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడం తెలిసిందే. దీంతో డ్యాం భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అప్పటినుంచి మరమ్మతులు చేపట్టి అన్నీ కొత్తవి అమర్చారు.

పాము కాటుకు బాలుడు బలి

యశవంతపుర: పాము కరిచి ఒకే ఇంట్లో బాలుడు చనిపోగా, అతని సోదరి తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఉత్తరకన్నడ జిల్లా శిరసి తాలూకా బనవాసి సమీపంలోని సహస్రళ్లిలో జరిగింది. పుట్టప్ప నాయక కుమారుడు మిథున్‌ (12), కుమార్తె దీక్ష (9) ఇంట్లో నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున బాలలు ఇద్దరూ హఠాత్తుగా నిద్రలేచి వాంతులు చేసుకున్నారు. తల్లిదండ్రులు లేచి చూడగా ఇంట్లో నుంచి పాము బయటకు వెళ్లింది. వెంటనే పిల్లలను పట్టణంలోని మహాలక్ష్మి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మిథున్‌ చనిపోయాడు. బాలిక చికిత్స పొందుతోంది. మిథున్‌ 6వ తరగతి, దీక్ష 3వ తరగతి చదివేవారు.

యువతిపై ఖాకీ కన్ను

● ప్రేమ, పెళ్లి పేరుతో అత్యాచారం, అబార్షన్లు

శివమొగ్గ: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ పోలీసు కానిస్టేబుల్‌ తనపై అత్యాచారానికి పాల్పడి, గర్భం దాలిస్తే అబార్షన్‌ చేయించాడని ఓ యువతి ఆరోపించింది. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమై తర్వాత ప్రైవేట్‌ వీడియోలను అడ్డు పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లైంగిక దాడులకు పాల్పడినట్లు తెలిపింది. ఓ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా ఏడాది క్రితం తనకు పరిచయమైనట్లు తెలిపింది. తాను పోలీసును కావడంతో బహిరంగ స్థలాల్లో మాట్లాడటం కష్టమని చెప్పి లాడ్జిలకు పిలుచుకెళ్లి అత్యాచారం చేశాడంది. గర్భం దాల్చడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి అబార్షన్‌ చేయించాడనని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని, ఇప్పుడు ఎవరో తెలియదని బెదిరిస్తున్నాడని వాపోయింది.

ఎస్పీకి ఫిర్యాదు చేసినా అంతే

ఓసారి 112 సహాయవాణికి ఫిర్యాదు చేయగా అక్కడ రాజీ చేసుకుని, అప్పులు తీరగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, మళ్లీ ఆ ప్రస్తావన తెచ్చినందుకు తీవ్రంగా కొట్టాడని వాపోయింది. ఇప్పుడు వేరే యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడని, అడ్డొస్తే ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. జిల్లా ఎస్పీ, డీఐజీలకు ఫిర్యాదు చేశానని, నిందితుడు దర్జాగా తిరుగుతున్నాడని ఆరోపించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement