ఇంటింటా సంక్రాంతి శోభ
యశవంతపుర: భోగి, సంక్రాంతి పండుగ సందడి బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా నెలకొంది. ఇంటింటా బంధువులతో కళకళలాడుతోంది. ప్రసిద్ధ దేవాలయాలలో రథోత్సవాలు, జాతరలు జరుగుతున్నాయి. ఇక ఇంటింటా పిండివంటలు, పూజల కోలాహలం నెలకొంది. అందమైన రంగువల్లులతో అలంకరించారు. పల్లెల్లో రైతులు పశుసంపదకు పూజలు చేసి కష్టసుఖాల్లో తమకు తోడుగా ఉన్నందుకు వంటకాల నైవేద్యాలను సమర్పించారు.
మార్కెట్లలో రద్దీ
మార్కెట్లు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపారాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. టన్నుల కొద్దీ చెరకు, పప్పుల విక్రయం సాగింది. పూలు, పండ్లు, చక్కెర బొమ్మలు, మిఠాయిల కొనుగోళ్లు ఎక్కువగా జరిగింది. శెనగలు, పప్పులు, గెణసు గడ్డల ధరలు గణనీయంగా పెరిగాయి.
భోగి సంబరాలు
బుధవారం ఆనందోత్సాహాలతో భోగిని ఆచరించారు. ఇళ్ల ముందు చెరుకు గడలను పాతి, కొత్త కుండల్లో పొంగల్, తీపి అన్నం వండి ఆరగించారు. గురువారం సంక్రాంతి పండుగకు సర్వం సిద్ధం చేశారు. సంప్రదాయం ప్రకారం ఎండు కొబ్బరి, పప్పులు, కలకండ, చెరకు, చెక్కర, అచ్చు బెల్లాన్ని బంధువులు, ఇరుగుపొరుగుకు ఇచ్చిపుచ్చుకున్నారు. వారం రోజుల నుంచి మహిళలు పండుగకు ఈ వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. బెంగళూరు నుంచి వేలాది మంది పండుగకు సొంతూళ్లకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఒక్క రోజు సెలవు మాత్రమే ఇచ్చాయి. పల్లెల్లో ఎద్దులను అలంకరించి మంటల మీద నుంచి ఎగిరించారు.
బెంగళూరులోని జయనగరలో మహిళలచే భోగి సంబరాలు
బుధవారం బెంగళూరులో చక్కెర అచ్చులు, మిఠాయిల కొనుగోళ్లు
ఆనందోత్సాహాలతో భోగి పండుగ
ఇళ్లూ, వాకిళ్లు కళకళ
ఇంటింటా సంక్రాంతి శోభ


