కుక్కల దాడిలో బాలిక బలి
దొడ్డబళ్లాపురం: వీధికుక్కల దాడిలో గాయపడిన బాలిక చికిత్స ఫలించక ప్రాణాలు విడిచింది. ఈ విషాద సంఘటన బాగలకోట పట్టణంలో వెలుగుచూసింది. పట్టణంలోని నవ నగర్‌లో గత డిసెంబర్ 27న అలైనా (10) అనే బాలికపై ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేసి కరిచాయి. తీవ్ర గాయాలైన చిన్నారిని తల్లిదండ్రులు కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆనాటి నుంచి మృత్యువుతో పోరాడిన బాలిక చికిత్స ఫలించక మృతిచెందింది. మున్సిపల్ అధికారులకు కుక్కలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.
బాలునిపై కుక్కల దాడి
దొడ్డబళ్లాపురం: రెండేళ్ల బాలునిపై వీధికుక్కలు దాడి చేసిన సంఘటన బెళగావి జిల్లా చిక్కోడి పట్టణంలో జరిగింది. బాలుడు రుత్విక్ ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు మీదపడి కరిచాయి. బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వర్గీకరణ బిల్లు వెనక్కి
బనశంకరి: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుపై స్పష్టత ఇవ్వాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆ బిల్లును వెనక్కిపంపారు. డిసెంబరులో జరిగిన బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఆమోదించింది. ఎస్సీలలోని ఉపకులాల మధ్య వివిధ నిష్పత్తిలో రిజర్వేషన్లను కేటాయించింది. బిల్లు ఆమోదం కోసం గత వారం గవర్నర్‌కు పంపింది. కానీ ఇప్పుడు వెనక్కి వచ్చింది. అది ఆమోదం పొందేవరకు ఉద్యోగ నియామకాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
స్కూటీకి ప్రాబ్లం..
చైన్ స్నాచింగ్
మైసూరు: మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కొని పరారైన ఘటన నగరంలోని అశోకపురం రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. చిక్కహరదనహళ్లి నివాసి రష్మి అనే మహిళ స్కూటీలో ఇంటికి వెళుతుండగా, రైల్వేస్టేషన్ వద్ద ఏదో ఇబ్బంది వచ్చి స్కూటర్ నిలిచిపోయింది. ఆ సమయంలో స్కూటీకి ఏమైందా? అని రశ్మి పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఆమె మెడలోని 40 గ్రాముల బరువైన బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. అశోకపురం ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది.
మెట్రో పనుల్లో ప్రమాదం.. కూలిన క్రేన్
బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలోని బొమ్మనహళ్ళి హెచ్‌ఎ్‌స్‌ఆర్ లేఔట్ సమీపంలో ఉన్న అగరలో జరుగుతున్న బ్లూలైన్ మెట్రో రైలు వంతెన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున భారీ క్రేన్ కుప్పకూలిపోయింది. ఇది సెంట్రల్ సిల్క్‌బోర్డు వద్ద నుంచి ఔటర్ రింగ్ రోడ్డును కలిపే మార్గం. ఈ క్రేన్ 500 టన్నుల బరువును ఎత్తే సామర్థ్యం కలది. 100 టన్నుల స్టీల్ గడ్డర్‌ను ఎత్తుతుండగా ఇలా జరిగిందని ఇంజనీర్లు తెలిపారు. అదృష్టవశాత్తు జన సంచారం లేకపోవడంతో ఎవరికీ హాని కలగలేదు. పడిపోయిన క్రేన్‌ను ఎత్తడానికి మరో రెండు భారీ క్రేన్‌లను ఉపయోగిస్తున్నారు.
కుక్కల దాడిలో బాలిక బలి


