నలుగురిని బలిగొన్న ఓవర్‌టేక్
శివమొగ్గ: కేఎస్ ఆర్టీసీ బస్సును స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించగా, ముగ్గురు గాయపడిన ఘటన మంగళవారం రాత్రి జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా భారతీపుర వద్ద జరిగింది. బాధితులు చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా మెణసె గ్రామ నివాసులు. వివరాలు.. చెన్నగిరికి వెళ్లి శుభకార్యంలో పాల్గొని కారులో శృంగేరికి వాపసు వస్తున్నారు. మంగళూరు నుంచి రాయచూరుకు వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ బస్సును భారతీపుర మలుపు వద్ద కారు ఢీకొంది. ఓవర్‌టేక్ చేసే హడావుడిలో కారు డ్రైవర్ అదుపు తప్పాడు. కారులోని బి.ఫాతిమా (70), రిహాన్ (14)లు అక్కడికక్కడే మరణించగా, రాహిల్ (9), జయాన్ (12) శివమొగ్గలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. జరీనా (35), రిహా(12), కారు డ్రైవర్ రియాజ్ (35)లు గాయపడ్డారు. కారు డ్రైవర్ అజాగ్రత్త డ్రైవింగే ప్రమాదానికి కారణమని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
బైక్‌ను బస్సు ఢీ, ఇద్దరు మృతి
మైసూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొని ఇద్దరు మరణించిన ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా రామపుర పోలీసు స్టేషన్ పరిధిలోని కోణనకెరె గ్రామం వద్ద జరిగింది. మృతులను హనూరు తాలూకా రామేగౌడనహళ్లి శివప్ప, సత్తిగా గుర్తించారు. మలెమహదేశ్వర బెట్ట నుంచి చామరాజనగరకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొంది, యువకులు ఇద్దరూ అక్కడే దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రామాపుర పోలీసు కేసు నమోదు చేసుకున్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
శివమొగ్గ జిల్లాలో దుర్ఘటన


