నాపై హత్యాయత్నం చేశారు
సాక్షి,బళ్లారి: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ నేపథ్యంలో బ్యానర్ ఏర్పాటు చేసే విషయంలో తమను పథకం ప్రకారం అంతం చేయాలనే ఉద్దేశ్యంతో కాలు దువ్వి రగడ పెట్టుకుని, వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని మోకా రోడ్డులోని వాజ్‌పేయి లేఅవుట్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడి చేసిన ఘటనపై ఈనెల 17వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం, ఆందోళన చేయనున్నట్లు చెప్పారు.
నిబంధనల ప్రకారం లేనందుకే అడ్డు చెప్పాం
నిబంధనల ప్రకారం బ్యానర్ ఏర్పాటు చేసి ఉంటే తాము ఎందుకు అడ్డు చెప్పామన్నారు. రోడ్డుకు, ఇంటికి అడ్డంగా బ్యానర్ వేస్తుండటంతో పోలీసులకు చెప్పి తీయించామన్నారు. తనను, శ్రీరాములును అంతం చేయాలనే ఉద్దేశంతో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనపై సీఐడీతో విచారణ చేస్తే ఎలాంటి న్యాయం దొరకదన్నారు. సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ చేయించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని రాజకీయ పరిణామాలతో తాము విడిగా పోటీ చేయడంతో లాటరీ ఎమ్మెల్యేగా నారా భరత్‌రెడ్డి గెలిచారన్నారు. ఆ తర్వాత అభివృద్ధిని పక్కన పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పార్టీ కార్యవర్గ సభ్యులు, పలువురు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భరత్‌రెడ్డిపై
గాలి జనార్దనరెడ్డి ఆరోపణ
సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్


