అధిక లాభాల ఆశ చూపి టోకరా
హొసపేటె: డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికిన ఆన్‌లైన్ కేటుగాళ్లు లక్షలాది రూపాయలు మోసం చేసిన కేసు తాలూకాలోని టీబీ డ్యాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక కంపెనీలో సభ్యుడిగా చేరి డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని గతేడాది నవంబర్ 11న ఓ కంపెనీ నుంచి ఆరోగ్య దాస్ అనే వ్యక్తి వాట్సాప్ నెంబర్‌కు ఒక సందేశం వచ్చింది. మీరు కంపెనీలో సభ్యులుగా చేరి డబ్బు పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయని అందులో ఉంది. దాంతో అతను ఆ కంపెనీలో చేరారు. అప్పుడు కంపెనీ సభ్యుడి ఐడీ నెంబర్‌ను వాట్సాప్‌లో పంపింది. అప్పుడు కంపెనీ తనకు దాదాపు 12 బ్యాంక్ ఖాతా నెంబర్లను పంపింది. ఆ మేరకు తాను ఆ ఖాతాల్లో దశలవారీగా డబ్బు పెట్టుబడి పెట్టానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డిసెంబర్ 12న మీ ఖాతాలో రూ.1.50 కోట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. కమీషన్ డబ్బు మీ ఖాతాకు జమ కావాలంటే పన్ను చెల్లించిన నాలుగు గంటల్లోపు మీ బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తామని తనకు సందేశం వచ్చిందన్నారు. దాంతో తాను వెంటనే ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.14 లక్షలు బదిలీ చేశానని తెలిపారు. తాను ఫోన్ పే, ఆర్‌టీజీఎస్ ద్వారా దశల వారీగా దాదాపు రూ.44.50 లక్షలు బదిలీ చేశానన్నారు. జనవరి 1న మళ్లీ రూ.3 లక్షలు మీ ఖాతాలో జమ చేస్తామని ఒక సందేశం వచ్చింది. తనకు అనుమానం వచ్చి ఆడిట్ కార్యాలయానికి వెళ్లి విచారించగా అది నకిలీ కంపెనీ అని తేలిందని తెలిపారు. ఘటనపై టీబీ డ్యాం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుల పట్టివేతకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
రూ.45 లక్షలు కాజేసిన ఆన్‌లైన్ కేటుగాళ్లు


