కృత్రిమ అవయవాలతో ఆత్మవిశ్వాసం
బళ్లారిఅర్బన్: కృత్రిమ చేతులు, కాళ్లు అమర్చుకోవడం ద్వారా దివ్యాంగులు జీవితంలో కొత్త ఆశను, ఆత్మ విశ్వాసాన్ని పొందగలరని శిరిడి సాయి సేవా సత్సంగ్ ట్రస్ట్ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం కనకదుర్గమ్మ దేవస్థానం సమీపంలోని మ్యాక్స్ షోరూం కింద శిరిడి సాయి సేవా సత్సంగ్ ట్రస్ట్, రాజు గాంధీ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ చేతులు, కాళ్లు అమర్చే శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు, తదితర కారణాలతో చేతులు లేదా కాళ్లు కోల్పోయిన వారు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా బాధ పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో కృత్రిమ అవయవాలు అమర్చుకోవడం ద్వారా పూర్తిగా కాక పోయిన స్వావలంబనతో జీవితం సాగించే అవకాశం లభిస్తుందన్నారు. ముఖ్య అతిథులు పోలా రాధాకృష్ణ, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు కేహెచ్ రమేష్, కార్యదర్శి నాగబాలాజీ, ఖజానాదారు కే.గోవిందరాజు, సంయుక్త కార్యదర్శులు కొండయ్య, ఎం.రమేష్, వాసు, రామచంద్ర, వెంకటేష్, ఆర్.రమేష్‌కుమార్‌తో పాటు ట్రస్ట్ సభ్యులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


