మహనీయుల జయంతుల ఆచరణకు పిలుపు
కేజీఎఫ్ : మహనీయుల జయంతులను వైభవంగా ఆచరించాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. సోమవారం నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వేమన జయంతి, సవితా మహర్షి, అంబిగర చౌడయ్య జయంతి, రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలకు సంబంధించి జనవరి 26న ఉదయం 9 గంటలకు నగరసభ మైదానంలో కేజీఎఫ్ జిల్లా ఎస్పీతో ధ్వజారోహణం, అనంతరం కవాతు, గృహరక్షకదళ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీ కెడెట్లను ఆహ్వానించాలని సూచించారు. ధ్వజారోహణ వ్యవస్థ చేయడానికి పోలీస్ శాఖ, తహసీల్దార్, క్రీడాకారులు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమాల సిద్ధతా సమితులను రచించి పూర్వ సిద్ధతా ఉపసమితుల సమావేశం నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్లాస్టిక్ జెండాల వాడకం పూర్తిగా నిషేధించి విద్యార్థులు ప్లాస్టిక్ జెండాలు తీసుకురాకుండా బీఈఓ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా సమావేశానికి తహసీల్దార్‌తో పాటు పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో మరోసారి సమావేశాన్ని నిర్వహించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.


