రూ.460 కోట్లతో చెరువుల సంరక్షణ
రాయచూరు రూరల్: జిల్లాలో రూ.460 కోట్లతో 23 చెరువుల సంరక్షణకు తోడు పురాతన కాలం నాటి చెరువుల జీర్ణోద్ధరణకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. జిల్లాలోని లింగసూగూరు, మస్కి తాలూకాల్లో చెరువుల సంరక్షణకు వీలుగా నారాయణపుర క్యాంప్ వద్ద వెయ్యి ఎకరాల భూమికి సాగునీటిని అందించే ఎత్తిపోతల పథకానికి ఆయన శ్రీకారం చుట్టి మాట్లాడారు. నగరాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పైపులైన్లను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు. భూగర్భ జలాల వృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, శాంతప్ప, మల్లికార్జున, శివకుమార్, వెంకటరెడ్డి, మంజునాథ్, రుద్రప్ప అంగడి, శివమూర్తి, అమరేగౌడ, అధికారులు బసన గౌడ, కిరిలింగప్పలున్నారు.


