విద్యార్థులకు టెన్త్ కీలక ఘట్టం
మాలూరు: విద్యార్థులకు పదవ తరగతి ప్రముఖ ఘట్టమని, టెన్త్‌లో విద్యార్థుల జీవితానికి పునాది పడుతుందని, బాగా చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామప్ప గుత్తేదార్ తెలిపారు. సోమవారం తాలూకాలోని లక్కూరు గ్రామంలో గడినాడు సాంస్కృతిక భవనం సభాంగణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత కాలపు విద్యా విధానానికి నేటి విద్యా విధానానికి ఎంతో తేడా ఉంది. విద్యార్థులు నిర్ధిష్ట లక్ష్యాలు ఉంచుకుని చదివితేనే లక్ష్యం సాధించడం సాధ్యమవుతుందన్నారు. పదో తరగతిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైతేనే ఉన్నత విద్యను అభ్యసించగలరన్నారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ సమయంలో సోమరిగా ఉంటే భవిష్యత్తు మొత్తం కష్టపడాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ శృతి, కళాశాల ప్రిన్సిపాల్ శంకరప్ప, డిప్యూటీ తహసీల్దార్ అలీం ఉన్నీసా తదితరులు పాల్గొన్నారు.


