బాబోయ్.. చలి భూతం
బనశంకరి: రాష్ట్రంలో గతంలో లేని విధంగా చలి వణికిస్తుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. కరావళి మినహా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదవుతోంది. కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువ ఉండగా చలి వణికిస్తోంది. కళ్యాణ కర్ణాటక ప్రాంత జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. చలిబారి నుంచి విముక్తి పొందడానికి స్వెట్టర్లు, చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.
శీతల వాతావరణం: బెళగావిలో కనీస ఉష్ణోగ్రత 10.4 డిగ్రీలు, బీదర్ 7.8, విజయపుర 7, ధారవాడ 9, గదగ్ 10.2, కలబుర్గి 13, హావేరి 11.8, కొప్పళ 11.9, రాయచూరు 9.6, శివమొగ్గ జిల్లాలోని అగుంబె 10.6, బెంగళూరు 13.3, దేవనహళ్లి విమానాశ్రయం 14.7, చిత్రదుర్గ 14, దావణగెరె 10, హాసన్ 8, చింతామణి 8.4, మైసూరు 15.4, శివమొగ్గ 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 28 డిగ్రీల మధ్య ఉంది.
చలి, పొగమంచు
బెంగళూరులో కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల తెల్లవారుజామున దట్టంగా పొగమంచు ఆవరిస్తోంది. ముందున్న ఏవీ కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా చలి తగ్గడం లేదు. ఆరుబయట ఎండలో కూర్చుంటేనే ఊరటగా ఉంటుంది. వృద్ధులైతే రగ్గులు, కంబళ్లు కప్పుకుని కాలక్షేపం చేస్తుంటారు. సాయంత్రం 4, 5 గంటల నుంచే చలి ఎక్కువవుతోంది. దీంతో వేడి వేడి ఆహార పదార్థాల విక్రయాలు పెరిగాయి.
గతంలో లేనంతగా శీతాకాల ప్రభావం
కళ్యాణ కర్ణాటకలో మరీ అధికం
బాబోయ్.. చలి భూతం


