బెంగళూరుకు 2 పెరిఫెరల్ రింగ్ రోడ్లు
బనశంకరి: బెంగళూరు శివారులో రూ.26 వేల కోట్ల వ్యయంతో 131 కిలోమీటర్ల పొడవుతో రెండు పెరిఫెరల్ రింగ్ రోడ్లను నిర్మిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. శనివారం విధానసౌధ బ్యాంక్వెట్ హాల్‌లో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలోని 5 నగర పాలికెల్లో కర్ణాటక అపార్టుమెంట్ (యజమాన్య నిర్వహణ) బిల్లు– 2025 గురించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక పెరిఫెరల్ రింగ్‌రోడ్డు 67 కిలోమీటర్లు, మరో రోడ్డు 77 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్ల నిర్మాణానికి రూ. 26 వేల కోట్లు అవసరమని అంచనా. హడ్కో సంస్థ నుంచి రుణం తీసుకుని నిర్మాణం చేపట్టాలని తీర్మానించామని తెలిపారు.
సొరంగ మార్గానికి త్వరలో టెండర్లు
నగరంలో సొరంగ రోడ్డు మార్గాన్ని ఉత్తర– దక్షిణ, తూర్పు– పశ్చిమంగా చేపట్టాలని నిర్ణయించగా దీనిపై అనేక విమర్శలు వచ్చాయని, విమర్శలను పట్టించుకోమని, పనులు సాగిస్తామని, త్వరలో టెండర్లను పిలుస్తామని డీసీఎం చెప్పారు. దేశంలోనే మొదటిసారి 50 కిలోమీటర్ల పొడవుతో డబుల్ డెక్కర్ రోడ్డును, ఫ్లై ఓవర్ పై మెట్రోరైలు మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు. అలాగే 117 కిలోమీటర్ల పొడవుతో కొత్త ఫ్లై ఓవర్‌ను నిర్మించే యోచన ఉందన్నారు. బెంగళూరు వాతావరణం చాలా బాగుంటుందని అన్నారు. అందుకే ఉద్యోగాల కోసం బెంగళూరుకు వచ్చేవారు పెరిగారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు, విశ్రాంత జీవనానికి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. శరవేగంగా విస్తరిస్తున్న బెంగళూరుకు సుపరిపాలన అందించడానికి గ్రేటర్ బెంగళూరు ప్రాధికారను ఏర్పాటు చేశామన్నారు. నగర జనాభా 1.4 కోట్లు ఉండగా, 1 కోటి వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని 1.34 కోట్ల వాహనాలు సంచరిస్తున్నాయని తెలిపారు. నేను బెంగళూరులోనే రాజకీయాల్లోకి చేరి ఈ స్థాయికి వచ్చాను, నగరం గురించి చాలా అవగాహన ఉంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించాలి, దీని కోసం అనే పథకాలను రూపొందించామని తెలిపారు.
131 కి.మీ పొడవునా నిర్మాణం
ఖర్చు రూ.26 వేల కోట్లు: డీసీఎం శివ
బెంగళూరుకు 2 పెరిఫెరల్ రింగ్ రోడ్లు


