ఆర్టీసీ బస్సులకు స్పందన సేవలు
● రవాణా మంత్రి రామలింగారెడ్డి
బనశంకరి: ఆర్టీసీ బస్సుల మరమ్మతులకు స్పందన వాహనాలు ఉపయోగిస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. శాంతినగర కేఎస్ ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వద్ద స్పందన వాహనాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బస్సులు మార్గమధ్యంలో యాంత్రిక సమస్యలతో మొరాయిస్తే, మొబైల్ వర్క్‌షాప్ తరహాలో స్పందన వాహనాలు పనిచేస్తాయన్నారు. ప్రమాద సమయంలోనూ సదరు స్థలాలకు వెళ్లి త్వరితగతిన బస్సుకు మరమ్మతులు చేయడానికి ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారన్నారు. బెంగళూరు, మైసూరు కేంద్ర స్థలాల్లో వాటిని అందుబాటులో ఉంచుతామని, తుమకూరు, కోలార్, చిక్కబళ్లాపుర, మైసూరు, మండ్య తదితర ప్రాంతాల్లో అవి సేవలందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భరమగౌడ, అలగౌడకాగే, అరుణ్ కుమార్, ఎంవై.పాటిల్, వీఎస్.ఆరాధ్య, మహమ్మద్ రిజ్వాన్, నవాజ్, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారిపై దుండగుల అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం: బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు కామాంధుల ఉదంతమిది. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని ఒక గ్రామంలో 10 ఏళ్ల బాలికను బెదిరించి 40 ఏళ్లు, 24 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఎవరికై నా చెబితే నీ తల్లిని చంపేస్తామంటూ బాలికను బెదిరించారు. బాలిక పాఠశాలలో టీచర్‌కి ఈ దురాగతం గురించి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇన్‌స్టా ప్రేమాయణం
వివాహిత.. ఖాకీ పరార్
బనశంకరి: ఆన్‌లైన్ ప్రేమలు కాపురాలను చీలుస్తున్నాయి. రెండో భర్త ను వదిలిపెట్టి ఇన్‌స్టాలో పరిచయమైన కానిస్టేబుల్ తో మహిళ పారిపోయింది. బెంగళూరు చంద్రాలేఔట్ నివాసి మోనిక, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో నివసించే కానిస్టేబుల్ రాఘవేంద్రతో ప్రేమలో పడి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. వివాహమై, కుమారుడు ఉన్న రాఘవేంద్ర.. ఇన్‌స్టాలో మోనిక వీడియోలను చూసి మనసు పారేసుకున్నాడు. ఇద్దరూ ఇన్‌స్టాలో పరిచయం పెంచుకుని, బయట షికార్లు కూడా చేస్తున్నారు. మోనిక మొదటి భర్తను వదిలిపెట్టి రెండో భర్తతో ఉంటోంది. ఇక మోనిక, పోలీసు అనేక రీల్స్ కూడా చేయసాగారు. ఈ నేపథ్యంలో ఇరువురూ తమ కుటుంబాలను వదిలి పరారయ్యారు. ఇంట్లోని 160 గ్రాముల బంగారు నగలు, రూ.1.80 లక్షల నగదుతో మోనిక వెళ్లిపోయిందని భర్త చంద్రాలేఔట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వీరిద్దరి బాగోతం గురించి పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలో రాఘవేంద్రను శనివారం సస్పెండ్ చేశారు.
ఆర్టీసీ బస్సులకు స్పందన సేవలు


