హనుమ నామం.. మైసూరు కేసరిమయం
మైసూరు: వారసత్వ నగరిలో హనుమాన్ జయంతి కోలాహలం నెలకొంది. నగర హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం భారీస్థాయిలో ఊరేగింపు, కళాబృందాల ప్రదర్శన మధ్య జరిగింది. మొదట మైసూరు ప్యాలెస్ ఆవరణలో ఉన్న కోటె ఆంజనేయస్వామి ఆలయంలో హోమం హవనం, విశేష పూజలు జరిపారు. తులసి, మైసూర్ మల్లెలు, వివిధ పుష్పాల పూలదండలతో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి హారతులు పట్టారు. ఎమ్మెల్యేలు జి.టి. దేవెగౌడ, జి.డి.హరీష్ గౌడ, మాజీ ఎంపీ ప్రతాప్ సింహా, మాజీ ఎమ్మెల్యే ఎల్. నాగేంద్ర తదితరులు పూలమాలలు సమర్పించి ఊరేగింపును ప్రారంభించారు. ప్రధాన విగ్రహం ఉన్న వాహనం వెనుక అనేక వాహనాలు, వేలాది భక్తులు, కళాబృందాల ప్రదర్శనల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ప్రధాన కూడళ్ల గుండా వెళ్లి గన్‌హౌస్ వద్ద ముగిసింది. రోడ్లకు ఇరువైపులా జనసందోహం వీక్షించింది.
నినాదాల హోరు
రోబోటిక్ ఆంజనేయస్వామి విగ్రహాల కదలికలు భక్తులను అబ్బురపరిచాయి. రావణాసురునితో గదతో పోరాటం, జై శ్రీరామ్, ఓం అక్షరం, కాలభైరవ విగ్రహం ఆకట్టుకున్నాయి. కాషాయ శాలువాలు, టీ–షర్టులు ధరించి జెండాలు పట్టుకుని వేలాది యువకులు జై హనుమాన్ నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. శివరాజ్‌కుమార్ నటించిన వజ్రకాయ చిత్రంలోని జై ఆంజనేయ పాటకు యువకులు నృత్యాలు చేశారు. విదేశీ పర్యాటకులు కూడా చిందులు వేశారు.
భారీఎత్తున జయంతి ఉత్సవం


