
సోషల్ వేధింపులపై రమ్య ఫిర్యాదు
యశవంతపుర: సోషల్ మీడియాలో తన గురించి అశ్లీల కామెంట్లు చేసిన 43 ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్లపై నటి రమ్య బెంగళూరు పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. హత్య చేస్తామని కూడా బెదిరించారని తెలిపారు. నాలుగు పేజీల ఫిర్యాదును కమిషనర్‌కు అందజేశారు. ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు కేసును అప్పగించారు. కేసు విచారణకు ఓ ఏసీపీని నియమించారు. చిత్రదుర్గం రేణుకాస్వామి హత్యను ఖండిస్తూ, ఆయన కుటుంబానికి మద్దతుగా రమ్య మాట్లాడుతున్నారు. దీంతో నటుడు దర్శన్ అభిమానులు తనను బెదిరిస్తున్నారని రమ్య ఆరోపించారు.
రమ్యకు శివణ్ణ మద్దతు
రమ్యపై అవహేళన పోస్టులను ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ ఖండించారు. రమ్యకు ఆయన మద్దతు ప్రకటించారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం సరికాదన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని మనవి చేశారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని కోరారు.
చంపుతామంటున్నారు: ప్రథమ్
బనశంకరి: దర్శన్‌తో పాటు జైలులో ఉన్న వ్యక్తి నన్ను బెదిరించారు అని కన్నడ బిగ్‌బాస్ నటుడు ప్రథమ్ బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే.బాబాకు ఫిర్యాదు చేశారు. దర్శన్ ను హేళన చేస్తావా అంటూ అతడు డ్రాగర్‌తో దాడికి యత్నించాడని తెలిపారు. 500 కు పైగా ఇన్ స్టా ఖాతాలలో తనను దూషించారని, ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.