
రమ్య వర్సెస్ దర్శన్ ఫ్యాన్స్
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ అభిమానులపై ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య భగ్గుమన్నారు. దూషిస్తూ పోస్టులు పెట్టడంతో పాటు నాకు అశ్లీల సందేశాలను పంపిస్తున్నారని రమ్య ఆరోపించారు. మరోవైపు దర్శన్ భార్య విజయలక్ష్మి కూడా రమ్యపై కన్నెర్రజేశారు. రాజకీయ, చిత్రసీమలో ఇది చర్చనీయాంశమైంది. వివరాలు.. రేణుకాస్వామి హత్యను రమ్య అనేకసార్లు ఖండించారు. ఆ కుటుంబానికి మద్దతుగా రమ్య మాట్లాడటం, దర్శన్‌కు శిక్ష పడాలని కోరుకోవడం ఆయన అభిమానులకు తీవ్ర కోపాన్ని తెచ్చింది. దర్శన్ అభిమానులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో రమ్యను కించపరిచేలా ఆదివారం నుంచి అశ్లీల సందేశాలను పోస్టు చేశారు. అశ్లీల సందేశాలు పెట్టిన అకౌంట్ల వివరాలను రమ్య బహిరంగం చేశారు.
ఏం జరిగింది..
రేణుకాస్వామికి త్వరలో న్యాయం జరుగుతుందని రమ్య సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని దర్శన్ అభిమానులు తప్పుపడుతూ వ్యతిరేక కామెంట్లు చేశారు. దర్శన్ భార్య విజయలక్ష్మి కూడా ఆగ్రహించారు. కేసు కోర్టులో విచారణలో ఉండగా దర్శన్ దోషి అంటూ రమ్య పోస్టు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సిద్ధమయ్యారు. దర్శన్ అభిమానులు ఎవరూ గొడవలకు వెళ్లొద్దని విజయలక్ష్మి మనవి చేశారు. ఎవరికీ సందేశాలు పంపవద్దు. ఎవరు ఏమి సందేశాలు పెట్టినా గొడవకు పోవద్దు అని డెవిల్ సినిమా పోస్టరు ద్వారా మనవి చేశారు.
కమిషనర్‌కు రమ్య ఫిర్యాదు
నటి రమ్య సోమవారం బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దర్శన్ అబిమానులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు, అశ్లీల మెసేజ్‌లు వస్తున్నాయని రమ్య తెలిపారు. అందరు ఆడపిల్లల తరఫున ఫిర్యాదు చేశానని, ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారామె. పురుషులకు ఎంత స్వేచ్ఛ ఉందో మహిళలకు కూడా స్వాతంత్య్రం ఉందన్నారు. తనకు చిత్రరంగంలో మద్దతుగా పలువురు మెసేజ్ చేశారని తెలిపారు. అశ్లీల సందేశాలను రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీ చౌదరి తప్పుబట్టారు. అలాంటి వ్యక్తులపై కేసు నమోదు చేయాలని నగర పోలీసు కమీషనర్‌కు ఆమె లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రమ్యకు మద్దతుగా నిలిచారు.
రేణుకాస్వామి హత్య కేసు వ్యవహారం..
నటిని బెదిరిస్తూ అశ్లీల సందేశాలు
రమ్య, దర్శన్ భార్య ఆరోపణల యుద్ధం

రమ్య వర్సెస్ దర్శన్ ఫ్యాన్స్

రమ్య వర్సెస్ దర్శన్ ఫ్యాన్స్