
యతీంద్రా.. నీకిది తగదు
మైసూరు: నాల్వడి కృష్ణరాజ ఒడెయార్ కంటే మా తండ్రి, సీఎం సిద్దరామయ్య మైసూరులో ఎక్కువ అభివృద్ధి చేశారని ఎమ్మెల్సీ యతీంద్ర చెప్పడంపై ధర్నాలు కొనసాగుతున్నాయి. సోమవారం మైసూరు గాంధీ సర్కిల్‌లో జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. ఎమ్మెల్సీ వివేకానంద మాట్లాడుతూ నాల్వడి కాలి దుమ్ముకు కూడా యతీంద్ర సరిపోరని, అలాంటిది మహారాజుతో పోల్చుకోవడం ఏమిటని దుయ్యబట్టారు. మైసూరు మహారాజులు చేసిన మంచి పనులు కనిపిస్తున్నాయి, సిద్దరామయ్య ఏమి చేశారో చెప్పాలన్నారు.
యతీంద్రపై యదువీర్ విసుర్లు
మైసూరు: రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓట్లు వేసి అధికారం ఇచ్చింది మరొకరితో పోల్చుకోవడానికి కాదని, మనకున్న నాయకత్వంతో ప్రజలకోసం పని చేయాలని మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ అన్నారు. రాజవంశీకులపై సీఎం సిద్దరామయ్య తనయుడు యతీంద్ర విమర్శలు చేయడంపై ఈ విధంగా స్పందించారు. సిద్దరామయ్య హయాంలో నాల్వడి కృష్ణరాజ ఒడెయార్ కంటే ఎక్కువ అబివృద్ధి జరిగిందనడంపై సోమవారం యదువీర్ మండిపడ్డారు. తాను కూడా ఎంపీనే అని, ఎవరితోను పోల్చుకోనని అన్నారు. నాకున్న తెలివితో శక్తితో ప్రజలకు ఏం కావాలో అది చేస్తానని చెప్పారు. యతీంద్ర వెంటనే క్షమాపణలు చెప్పాలని అనేకమంది కోరుతున్నారు, క్షమాపణలు చెప్పాలా వద్దా అనేది ఆయన ఇష్టమని అన్నారు. మైసూరులో డ్రగ్స్ ఫ్యాక్టరీని కనిపెట్టి పోలీసులు మంచి పనిచేశారని, నగరంలో మత్తుపదార్థాలు అనేవి లేకుండా చేయాలని కోరారు.
పోలీస్ అధికారుల
సస్పెన్షన్ రద్దు
బనశంకరి: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నగర పోలీసు కమిషనర్ బి.దయానంద సహా ఐదుమంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేయడం తెలిసిందే. కమిషనర్ బీ.దయానంద్, పశ్చిమ అదనపు కమిషనర్ వికాస్ కుమార్, సెంట్రల్ డీసీపీ శేఖర్ తెక్కన్నవర్, కబ్బన్‌పార్కు ఏసీపీ బాలకృష్ణ, సీఐ గిరీశ్‌పై వేటేసింది. సోమవారం వారి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆకస్మాత్తుగా సర్కారు మెత్తబడడం తీవ్ర చర్చకు దారితీసింది. తొక్కిసలాట ఘటనకు పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణమి ప్రభుత్వం గతంలో తెలిపింది.
నలుగురు పోలీసుల సస్పెండ్
మైసూరు: డబ్బుల్ని రెట్టింపు చేసిస్తామనే దందాలో పాల్గొన్న నలుగురు పోలీసులను చామరాజనగర జిల్లా ఎస్పీ బీటీ కవిత సస్పెండ్ చేశారు. తమిళనాడుకు చెందిన అవినాషి సచ్చిదానంద అనే బాధితుడు మోసపోయినట్లు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇతనికి నిందితుడు అన్సారీ పరిచయమై డబ్బు ఇస్తే డబుల్ చేసి ఇస్తామని నమ్మించాడు. దీంతో రూ.3 లక్షలను తీసుకుని ఓ హోటల్‌లో మకాం వేశాడు. ఈ సమయంలో నలుగురు పోలీసులు వచ్చి నువ్వు చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నావు అని బెదిరించి డబ్బును దోచుకెళ్లారు. దీంతో ఫిర్యాదు చేయగా విచారణ సాగింది. నలుగురు పోలీసులను గుర్తించి సస్పెండ్ చేశారు.