
కేసు నమోదులో నిర్లక్ష్యంపై ఫిర్యాదు
బళ్లారిఅర్బన్: హరిశ్చంద్ర ఘాట్ ప్రాంతంలో చిన్న కారణంగా ఎస్టీ, ఇతర వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వల్ల వాల్మీకి మహిళలకు, పురుషులకు గాయాలై బీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఫిర్యాదు చేసినా కూడా గ్రామీణ పోలీస్ స్టేషన్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకుండా మూడు రోజుల నుంచి నిర్లక్ష్య ధోరణి చూపుతున్నారని జిల్లా పోలీస్ అధికారులకు వాల్మీకి నేతలు వాపోయారు. అఖండ కర్ణాటక వాల్మీకి నాయక ఒక్కూట రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మప్ప జోళదరాశి, ప్రధాన కార్యదర్శి ఎన్.సత్యనారాయణ తదితరుల సారథ్యంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి ముందు ఉన్న రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని నిలపడంతో ప్రారంభమైన జగడం పెద్ద ఘర్షణకు దారి తీసి ద్విచక్ర వాహన చోదకుడు రాంబాబు, ఉమేష్, ఇతర 15–20 మంది గుంపు తమ ఇళ్లపై దాడి చేసి మహిళలు, పిల్లలను చూడకుండా రాడ్లతో కొట్టి అసభ్యంగా నిందిస్తూ కుల నిందనకు పాల్పడ్డారని, అంతేగాక చంపుతామని బెదిరించారన్నారు. గాయపడిన వారిలో చాలా మంది చికిత్స పొంది బయటకు రాగా మరికొందరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారన్నారు. కేసుకు సంబంధించి గ్రామీణ సీఐ సతీష్‌కు విన్నవించగా ఆయన నుంచి తగిన స్పందన రాలేదన్నారు. సూరి, అంజి, వెంకటేష్, రాంబాబు, ఉమేష్ తదితరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏఎస్పీ రవికుమార్ ఘటనపై స్పందిస్తూ గాయపడిన వారు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేసిన తక్షణమే కేసు నమోదు చేస్తామన్నారు. ఆ సంఘం ప్రముఖులు వీకే.బసప్ప, జయరాం, రుద్రప్ప, ఎర్రగుడి ముదిమల్లయ్య, హగరి జనార్ధన, మించేరి రామాంజిని, కాయిగడ్డె బసవరాజ, దుర్గప్ప, బెణకల్ సురేష్ తదితర వాల్మీకి ప్రముఖులు పాల్గొన్నారు.