
హనీట్రాప్ ముఠా అరెస్టు
బనశంకరి: యువతి తీయని మాటలు నమ్మి వెళ్లిన యువకున్ని కిడ్నాప్ చేసి రూ.2.50 కోట్లు ఇవ్వాలని 8 రోజులు బంధించి దాడిచేసిన నలుగురిని శనివారం బెంగళూరు అశోక్‌నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. మహమ్మద్ ఆసిఫ్, నవాజ్, సుహేల్, సల్మాన్‌పాషా పట్టుబడిన వ్యక్తులు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న బెంగళూరుకు చెందిన లారెన్స్ అనే యువకుడు నగరానికి వచ్చి ఓ హోటల్‌లో ఉంటున్నారు. 15వ తేదీ తెల్లవారుజామున ఓ యువతి కాల్ చేసి తాను మహిమ అని, మిమ్మల్ని కలవాలని చెప్పింది. అతడు ఖుషీగా ఆమె చెప్పిన చోటుకు వెళ్లగా, పై నలుగురూ కారులో కిడ్నాప్‌చేసి ఇందిరానగర సర్వీస్ అపార్టుమెంట్‌కు తీసుకెళ్లి గదిలో బంధించారు. రూ.2.50 కోట్లను ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. నాతో అంత డబ్బు లేదని అతడు చెప్పాడు. 8 రోజులపాటు బంధించి రూ.25 లక్షలు ఇవ్వాలని చెప్పి వదిలిపెట్టారు. బాధితుడు అశోకనగర ఠాణాలో ఫిర్యాదు చేయగా యువతితో పాటు నలుగురిని నిర్బంధించారు.