
ధర్మస్థలలో సిట్ విచారణ
యశవంతపుర: ధర్మస్థలలో వందల సంఖ్యలో శవాలను పాతిపెట్టినట్లు ఓ అపరిచితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిట్ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం దక్షిణ కన్నడ పోలీసు ఉన్నత అధికారులతో భేటీ జరిపి, అర్ధరాత్రి ధర్మస్థల పోలీసుస్టేషన్‌కు వెళ్లి కేసు ఫైల్‌ను పరిశీలించారు. బెళ్తంగడిలోనూ తనిఖీలు చేశారు. పాతిపెట్టామని చెబుతున్న మృతదేహాలను వెలికితీయడానికి కోర్టు అనుమతినిచ్చింది. సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి, ఇతర ఐపీఎస్‌లు విచారణలో పాల్గొంటున్నారు. ఐపీఎస్ జితేంద్ర దయామ ధర్మస్థళ స్టేషన్‌లో ఎస్‌ఐ సమర్థ గణిగేర్‌తో కేసు ఫైల్‌ను అధ్యయనం చేశారు. ఫిర్యాదిదారుతో సహా సంబంధిత వ్యక్తుల విచారణకు సన్నాహాలు చేస్తున్నారు. సిట్ సక్రమంగా విచారణ చేస్తుందని, అనుమానాలు వద్దని జిల్లా దక్షిణ కన్నడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. జిల్లాలోని కడబలో పార్టీ సమావేశంలో మాట్లాడారు.