
కుక్కలకు మాంసాహార భోజనమా?
బనశంకరి: వీధి శునకాల దాడులతో జనం అల్లాడిపోతున్నారు. ఇందులో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. రాజధాని నగర జిల్లా పరిధిలో 13,831 వీధి కుక్కలు దాడులు నమోదయ్యాయి. దాడుల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాదిలో రేబీస్ మరణాల సంఖ్య రాష్ట్రంలో 19 కి చేరుకుంది. అందులో సగం మంది బెంగళూరువాసులు కావడం గమనార్హం.
గతేడాది 3.6 లక్షల మంది..
సిలికాన్ సిటీలో మార్కెట్లు, ప్రముఖ వీధుల్లో వీధి కుక్కల గోల అధికమైంది. రాష్ట్రంలో గత 6 నెలల్లో 2.3 లక్షకు పైగా వీధి కుక్కల దాడులు జరిగాయి. 2024 నివేదిక ప్రకారం వీధికుక్కల దాడుల్లో 3.6 లక్షల మంది గాయపడ్డారు.
అందులో 42 మంది రేబీస్ సోకి చనిపోయారు. 2023 నివేదికతో పోలిస్తే సుమారు 36 శాతం పెరిగింది. 2025 అర్ధ సంవత్సరంలో కుక్క దాడులు సంఖ్య భారీగా పెరిగి 2,31,091 కి చేరుకోవడం భయం కలిగిస్తోంది.
విజయపురలో అత్యధికంగా 15,527 మందిని వీధి కుక్కలు కరిచాయి. హాసన్‌లో 13,388, దక్షిణ కన్నడలో 12,524, బాగల్‌కోటేలో 12,392 కేసులు వచ్చాయి.
రేబీస్‌కు 19 మంది బలి
ఈ 7 నెలల్లో బెంగళూరులో 9 మంది, బెళగావిలో 5, బాగల్‌కోటే, బళ్లారి, చిక్కబళ్లాపుర, శివమొగ్గలో తలా ఒకరు రేబీస్ వల్ల ప్రాణాలు విడిచారు. కుక్క కాట్లు, రేబీస్ బెడద ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. బెంగళూరులో ఏటా కోట్లాది రూపాయలను కుక్కల నియంత్రణకు ఖర్చు చేస్తున్నా వాటి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదనే విమర్శలున్నాయి. సందు సందుల్లో వెంట పడి కరుస్తున్నాయి.
కరిస్తే ముప్పుతిప్పలు
కుక్క కాటు బారిన పడినవారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రేబీస్ టీకా కోర్సు తీసుకోవాలి. ఇది చాలా ప్రయాసగా మారింది. పల్లె ప్రాంతాల్లో రేబీస్ వ్యాక్సిన్ దొరకడం లేదు. మున్సిపల్ అధికారులు వీధి కుక్కల సంఖ్యను నియంత్రణలో ఉంచాలి. రేబీస్‌తో ఎవరైనా చనిపోతే ఆరోగ్యశాఖ అధికారులు వెళ్లి పరిశీలించాలి. చికిత్సలో ఆలస్యం చేశారా, వైద్యసిబ్బంది లోపం ఉందా అనేది తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు తెలిపారు.
బెంగళూరు నగరంలో 60 శాతం మంది వీధి కుక్కల బెడదతో విసిగిపోయారు. కుక్కలకు మాంసాహార భోజనం అందించే బీబీఎంపీ పథకం నవ్వుల పాలై తీవ్ర విమర్శలకు గురైంది. ఇది డబ్బు దోచుకునే ఉపాయం అని విపక్షాలు ఆరోపించాయి. కోట్లు ఖర్చుచేసి మాంసాహారం అందించాలా, ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నందున నియంత్రణ చర్యలు తీసుకోవాలా అనేది తీర్మానం చేయాలని డిమాండ్ చేశాయి. విమర్శలు వస్తున్నా బెంగళూరు పాలికె మాత్రం తగ్గడం లేదు. కుక్కలకు నిత్యం చికెన్ రైస్ సరఫరా చేయడానికి టెండర్ల గడువును ఆగస్టు 2 వరకు పొడిగించింది.
బెంగళూరుతో సహా పలు జిల్లాల్లో
అధిక ముప్పు
6 నెలల్లో 2.3 లక్షల మందికి కాట్లు

కుక్కలకు మాంసాహార భోజనమా?