
ఎరువుల కొరత నిజమే: సీఎం
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత లేదని, అయితే రాష్ట్రంలో ఈసారి అదనంగా 5 లక్షల హెక్టార్లలో సాగు చేయడం వల్ల డిమాండు పెరిగి కొరత ఏర్పడిందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అరసీకెరెలో శనివారంనాడు జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కాస్త ముందుగా రావడం, జొన్నపంట ఎక్కువగా వేయడం వల్ల యూరియా కొరత వచ్చిందన్నారు. మంత్రివర్గ విస్తరణపై ప్రశ్నించగా ఇప్పుడే ఆ ఆలోచనలేదని అన్నారు. డీసీఎం డీకే శివకుమార్, పలువురు మంత్రులు హాజరయ్యారు.
బెంగళూరుపై దూషణలు
యశవంతపుర: పొట్ట చేత పట్టుకుని బెంగళూరుకు రావడం, ఇక్కడ జీవిస్తూ నగరాన్ని కించపరచడం కొందరికి అలవాటుగా మారింది. బెంగళూరు ప్రజలకు తలకాయలేదంటూ అసభ్యంగా దూషించిన యువతి ఉదంతమిది. ఒడిశాకు చెందిన నేహా బిస్వాల్ బెంగళూరుకు వచ్చి ఓ ఆఫీసులో పని చేస్తోంది. రోడ్డుపై నడిచి వెళుతుండగా కారు వేగంగా వెళ్లడంతో వాన నీళ్లు ఆమైపె పడ్డాయి. నాపై మురికినీరు పడ్డాయంటూ రీల్ చేసి బెంగళూరు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడింది. బెంగళూరు ప్రజలకు విద్య ఉంది, బుద్ధి లేదంది. రోడ్డుపై బురదనీళ్లు నా నోట్లోకి పోయాయి. ఏడుస్తూ ఈ రీల్ చేస్తున్నా అని తెలిపింది. ఆమె ప్రవర్తనపై నగరవాసులు మండిపడ్డారు.