
పాల సమాఖ్య అధ్యక్షుడిగా హిట్నాళ్
సాక్షి,బళ్లారి: రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగర(రాబకొవి) జిల్లాల పాల సమాఖ్య నూతన అధ్యక్షుడుగా కొప్పళ శాసన సభ్యుడు రాఘవేంద్ర హిట్నాళ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నగరంలోని కుమారస్వామి ఆలయ సమీపంలోని కేఎంఎఫ్ కార్యాలయంలో జరిగిన నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కొప్పళ ఎమ్మెల్యే హిట్నాళ్ ఒక్కరే అధ్యక్ష స్థానానికి, ఎస్.సత్యనారాయణ మాత్రమే ఉపాధ్యక్ష స్థానానికి నామినేషన్ వేయగా, ఇద్దరూ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. పాల సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఽఅధ్యక్ష స్థానం దక్కించుకునేందుకు మాజీ కేఎంఎఫ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే భీమానాయక్ తీవ్రంగా పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారు. అయితే తీవ్ర పోటీ నెలకొనడంతో కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్ రెండు రోజుల క్రితం డైరెక్టర్‌గా ఎన్నికై న తర్వాత అధ్యక్ష స్థానం దక్కించుకోవడంపై దృష్టి సారించి చక్రం తిప్పారు.
హిట్నాళ్ వైపే మెజార్టీ సభ్యుల మొగ్గు
పాల సమాఖ్య డైరెక్టర్లుగా 12 మంది ఉండగా, వీరితో పాటు నామినేటేడ్ పదవుల్లో ఉన్న వారు కూడా నలుగురు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. దీంతో మొత్తం 16 మంది ఓటింగ్‌లో పాల్గొనగా, వీరిలో మెజార్టీ డైరెక్టర్లు, సభ్యులు రాఘవేంద్ర హిట్నాళ్ వైపు మొగ్గు చూపడంతో ఎమ్మెల్యే భీమానాయక్‌కు పరాభవం ఎదురైంది. ఇప్పటికే కేఎంఎఫ్‌లో అఽధికారం చలాయించిన ఈయన మళ్లీ అధ్యక్ష స్థానంపై కన్నేశారు. సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి అక్కడ పంచాయతీ పెట్టించారు. అయితే మెజార్టీ డైరెక్టర్లు, సభ్యుల సహకారం లభించకపోవడంతో చివరికి ఎన్నికకు కూడా దూరంగా ఉండటం గమనార్హం. రాబకొవి పాల సమాఖ్య అధ్యక్ష స్థానం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర పోటీ నెలకొనడంతో బళ్లారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, గణేష్ తదితరులు కూడా అధ్యక్ష స్థానం ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. మొత్తం మీద తీవ్ర ఉత్కంఠగా జరిగిన రాబకొవి అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కావడంతో అఽధికార పార్టీలో టెన్షన్‌కు తెరపడింది.
ఉపాధ్యక్షుడుగా సత్యనారాయణ ఏకగ్రీవం
ఉపాధ్యక్షుడుగా ఎస్.సత్యనారాయణ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. అనంతరం వారి అభిమానులు, కార్యకర్తలు కేఎంఎఫ్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. నూతన అధ్యక్షుడుగా ఎన్నికై న హిట్నాళ్ మాట్లాడుతూ రాబకొవి పాల సమాఖ్య పరిధిలో పాల ఉత్పత్తులను పెంచడంతో పాటు రైతులకు మేలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రాబకొవి అధ్యక్షుడుగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం, డీసీఎం, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కేఎంఎఫ్ డైరెక్టర్లు పూర్తి సహకారం అందించారని, వారందరి సలహా సూచనలతో పాల సమాఖ్య పరిధిలో సమస్యలను పరిష్కరించి, రైతులు, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు. నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మాట్లాడుతూ నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయం అన్నారు. విజయనగర జిల్లాలో ఉన్నట్లుగా బళ్లారి జిల్లాలో పాల ఉత్పత్తి సహకార సంఘాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపేందుకు చొరవ తీసుకుంటామన్నారు.
మాజీ అధ్యక్షుడు భీమానాయక్‌కు పరాభవం
అందరినీ తనకు అనుకూలంగా
తిప్పుకున్న వైనం

పాల సమాఖ్య అధ్యక్షుడిగా హిట్నాళ్