
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరపండి
హొసపేటె: ఆగస్టు 15న జరగనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో ఘనంగా జరపాలని, నియమావళి ప్రకారం జాతీయ జెండాను ఎగుర వేయాలని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ సూచించారు. నగరంలోని తన కార్యాలయ సభాంగణంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. డాక్టర్ పునీత్‌రాజ్ కుమార్ స్టేడియంలో జాతీయ జెండా ఎగుర వేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆరోజున ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో, ఉదయం 9 గంటలకు జిల్లా స్టేడియంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. వేడుకల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వివిధ ఉప కమిటీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తమ సిబ్బందితో కలిసి జెండా ఎగురవేసే కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకూడదు. దేశభక్తిని చాటేందుకు పాఠశాల పిల్లలతో ఉదయం మూడు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఆగస్టు 18న రాంపురలో
చిరబి మూగబసవేశ్వర రథోత్సవం
కొట్టూరు తాలూకాలోని రాంపుర గ్రామంలో చిరబి మూగబసవేశ్వర రథోత్సవాన్ని ఆగస్టు 18న ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని తన కార్యాలయ సభాంగణంలో నిర్వహించిన రథోత్సవంపై సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. వివిధ కారణాల వల్ల 18 సంవత్సరాలుగా నిలిచి పోయిన రాంపుర గ్రామంలోని చిరబి మూగబసవేశ్వర స్వామి రథోత్సవం, జాతరను భక్తుల భారీ డిమాండ్ మేరకు సాంప్రదాయకంగా జరుపుకునేందుకు అనుమతించినట్లు తెలిపారు. రథోత్సవ సన్నాహాలకు పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి తెలిపారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి హనుమంతప్ప, కొత్తూరు తహసీల్దార్ అమరేష్, ట్యాప్ ఈఓ డాక్టర్ ఆనంద్‌కుమార్, కూడ్లిగి డివిజన్ డిప్యూటీ ఎస్పీ మల్లేష్ దొడ్డమని, సీఐ వికాస్ లమాణి, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ శంకర్ నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, రాంపుర, చిరబి గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
అధికారులకు జిల్లాధికారి
దివాకర్ సూచన

స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరపండి