
వెంటాడిన మృత్యువు
●లారీ బోల్తా పడి వ్యక్తి మృతి
పెనుకొండ రూరల్: బతుకు తెరువు కోసం కర్ణాటక నుంచి వలస వచ్చిన వ్యక్తిని ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడి కబళించింది. స్థానికులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఫకృద్దీన్(36), ఫర్హానా దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం బతుకు తెరువు కోసం పెనుకొండకు వలస వచ్చారు. పంచర్ షాపును నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం దుద్దేబండ మలుపు సమీపంలో జాతీయ రహదారి–44 పక్కన పంచర్ షాపును ఏర్పాటు చేసుకున్నాడు. రోజు లాగే గురువారం పంచర్ షాపును తెరిచి తన పనిలో నిమగ్నమైన సమయంలో ఊహించని రీతిలో మృత్యువు వెంటాడింది. బెంగళూరు నుంచి అనంతపురం వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని నేరుగా పంచర్ షాపు వైపు దూసుకెళ్లింది. షాపు ముందు పని చేసుకుంటున్న ఫకృద్దీన్‌పై బోల్తా పడింది. ఘటనలో ఫకృద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడు ముస్తాక్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న కియా పీఎస్ ఎస్‌ఐ రాజేష్ అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

వెంటాడిన మృత్యువు