
ధర్మస్థల సామూహిక హత్యలపై విచారణ జరపండి
రాయచూరు రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో సామూహిక అపహరణలు, అత్యాచారాలు, హత్యలపై విచారణ జరిపి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. బుధవారం సింధనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు మానసయ్య మాట్లాడారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ధర్మస్థల మంజునాధుడు వెలసిన క్షేత్రంలో జరిగిన సామూహిక మరణాలపై న్యాయాంగ విచారణ చేపట్టాలన్నారు. ప్రస్తుతం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రాజకీయ ప్రభావంతో కేసు దారి తప్పుతోందని ఆరోపించారు. 1976 నుంచి ఇంతవరకు 400 మందికి పైగా విద్యార్థినులు, మహిళలు కిడ్నాప్, అత్యాచారం వంటి నరమేధాలు జరిగిన విషయాలను బహిరంగ పరిచిన కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. సౌజన్య కేసును మూసివేసి నిందితుల పరంగా నిలవడాన్ని తప్పుబట్టారు.ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ తహసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. గంగాధర, హొసమని, హనుమంతప్ప, రుక్మిణి, హులిగప్ప, ముదియప్ప, సంగప్ప, రంగప్పలున్నారు.