
చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయకుంటే పోరాటం
హొసపేటె: చెరుకు రైతుల ప్రయోజనం కోసం త్వరలో హొసపేటెలో చక్కెర కర్మాగారాన్ని స్థాపించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, లేకుంటే రాబోయే రోజుల్లో జిల్లా రైతులతో కలిసి తీవ్ర పోరాటం చేస్తామని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, గ్రీన్ ఆర్మీ విజయనగర జిల్లా అధ్యక్షుడు టి.నాగరాజ్ హెచ్చరించారు. నగరంలోని గాంధీచౌక్ వద్ద నిర్వహించిన రైతు అమరవీరుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా తాలూకాలోని చెరుకు రైతులు కర్మాగారం లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్పలకు విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు ఫలితం లేకపోయిందన్నారు. కర్మాగారం ఏర్పాటుకు స్థలం కోసం వెతుకుతూ సమయం వృథా చేస్తున్నారన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి రెండు నెలల గడువు ఇస్తే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్కెర కర్మాగారం మూసివేయడం వల్ల రైతులు, కార్మికులు, చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాలూకాలో 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల చెరుకు పండుతుంది. ఫ్యాక్టరీ లేకపోవడం వల్ల ప్రతి సీజన్‌లో చెరుకును బయట కర్మాగారానికి రవాణా చేయడం కష్టమవుతోందన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ కర్మాగార స్థాపన గురించి నోరు విప్పడం లేదన్నారు. ఈ సందర్భంగా రైతు నేతలు సణ్ణక్కి రుద్రప్ప, గాళెప్ప, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.