
గుంతల రోడ్డే గతి?
బనశంకరి: హైటెక్ సిటీగా పేరున్న బెంగళూరులో ప్రధాన బస్టాండు నుంచి బయటకు రాగానే గుంతల రోడ్లు దర్శనమిస్తాయి. బనశంకరి బీఎంటీసీ బస్టాండు వద్ద గత మూడు నెలలుగా రోడ్డుపై గోతులు ఏర్పడి అధ్వాన్నంగా ఉంది. బీఎంటీసీ బస్టాండు పక్కనే రోడ్డుగుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక వచ్చేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. తక్షణం గుంతలను పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు.
లంచగొండ్లకు కటకటాలు
మండ్య: మండ్య నగర, గ్రామీణ పథకం సహాయక డైరెక్టర్ కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులను లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు. ఓ దరఖాస్తుదారు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా అనన్య, సౌమ్యా, హరీష్‌లను నిర్బంధించారు. మద్దూరుకు చెందిన పునీత్.. టౌన్ ప్లానింగ్ పని మీద అర్జీ వేశాడు. పని జరగాలంటే రూ. 30 వేల లంచం ఇవ్వాలని ముగ్గురూ డిమాండ్ పెట్టారు. బాధితుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. పునీత్ నుంచి అనన్య, సౌమ్యా, హరీష్ రూ. 15 వేలు తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు వచ్చి అరెస్టు చేశారు. లోకాయుక్త ఎస్పీ సురేష్‌బాబు, సీఐ బ్యాటెరాయనగౌడ పాల్గొన్నారు.
సమావేశానికి వెళ్లి
గుండెపోటుకు బలి
మైసూరు: నగరంలోని మహారాజ కాలేజీ మైదానంలో జరిగిన కాంగ్రెస్ సాధన సమావేశానికి వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో కన్నుమూశాడు. జిల్లాలోని టీ.నరసీపుర తాలూకా తురుగనూరువాసి కుమార్ (39).. శనివారం జరిగిన సమావేశానికి బస్సులో వచ్చాడు. తరువాత ఎవరికీ కనిపించలేదు, గ్రామస్తులు బస్సులో వెళ్లిపోయారు. రాత్రి అయినా కుమార్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు బన్నూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, మైసూరుకు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదే సమయంలో మైసూరు ఆస్పత్రిలోని మార్చురీకి ఓ మృతదేహం వచ్చిందని తెలిసింది. కుటుంబ సభ్యులు పరుగున వెళ్లి చూడగా కుమార్ అని తేలింది. సభకు వెళ్లినప్పుడు గుండెపోటు రావడంతో మరణించాడని గుర్తించారు.
ప్రియుని దురాగతానికి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: యువకుని వేధింపులు భరించలేని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కురికోట గ్రామంలో జరిగింది. కమలాపుర తాలూకా భూసణగి గ్రామం నివాసి సాక్షి ఉప్పార్ (22) మృతురాలు. ఆమెకు అభిషేక్ అనే యువకునితో గతంలో పరిచయం ఉండేది. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. కొన్ని రోజులుగా నీ ప్రైవేటు ఫోటోలు ఉన్నాయి, ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తూ వచ్చాడు. రెండురోజుల కిందట ఫోటోలు, వీడియోలను వైరల్ చేశాడు. దీంతో తీవ్రంగా కుంగిపోయిన బాధితురాలు బెణ్ణెతోరా డ్యాంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. మహాగాంవ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల జీఎస్టీ
దొడ్డబళ్లాపురం: కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసు వచ్చిన సంఘటన హావేరిలో జరిగింది. పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ వద్ద చిన్న కూరగాయల అంగడి పెట్టుకుని జీవిస్తున్న శంకరగౌడ అనే వ్యాపారికి జీఎస్టీ అధికారుల నుంచి రూ.29 లక్షల చెల్లింపు కోసం తాఖీదులు పంపించారు. మీ డిజిటల్ పేమెంట్ల ద్వారా 4 ఏళ్లలో రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగాయని, అందువల్ల పైన సూచించిన పన్ను కట్టాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు చూసిన వ్యాపారి లబోదిబోమంటున్నాడు.
రూ.28 లక్షలు టోపీ
మైసూరు: రాచనగరి మైసూరులో అధిక లాభాలు గడించాలని ఆశపడి లక్షలాది రూపాయలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఓ వృద్ధురాలు రూ.28.15 లక్షలను పోగొట్టుకుంది. విజయనగర నివాసి అయిన వృద్ధురాలి ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. లింకు నొక్కగా ఆన్‌లైన్ వంచకుల నుంచి కాల్ వచ్చింది. తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలను చూపిస్తామని చెప్పారు.
వృద్ధురాలు లాభాల ఆశతో సరేనంది. గ్రూప్ ఒరిజినల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనే నకిలీ కంపెనీ పేరు చెప్పి ఆమె నుంచి దశల వారీగా రూ. 28.15 లక్షలను దోచేశారు.

గుంతల రోడ్డే గతి?