
9 మంది ఆఫ్రికన్ల నిర్బంధం
బనశంకరి: వీసా గడువు ముగిసినా ఐటీ నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ డ్రగ్స్ వ్యాపారం లాంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడుతున్న 9 మంది ఆఫ్రికన్లను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ పౌరులే లక్ష్యంగా నగరమంతటా సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల వీసాలతో భారతదేశానికి వచ్చి వీసా అవధి ముగిసినా నగరంలో మకాం పెట్టిన 9 మంది విదేశీయులు ఆచూకీ కనిపెట్టి డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధించారు. వీరిలో నలుగురు నైజీరియా దేశానికి చెందిన వారు కాగా, ఒకరు సుడాన్, కాంగో దేశానికి చెందినవారు, మరో ఇద్దరు ఘనావాసులు. వారి వారి దేశాలకు పంపించనున్నారు.
త్వరలోనే ధర్మస్థలకు
సిట్: హోంమంత్రి
శివాజీనగర: ధర్మస్థలలో జరిగిన మహిళల హత్యల కేసుల్లో సిట్ బృందం త్వరలోనే వెళ్లి విచారణ ప్రారంభిస్తుందని హోంమంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సిట్‌లోని అధికారులందరూ విచారణలో పాల్గొంటారన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మృతదేహాల గాలింపు కోసం ధర్మస్థలకు వెళ్లాలని సిట్‌కు సూచించాం. సిట్ సభ్యులందరూ తప్పక వెళ్లాలి, విచారణలో పాల్గొనడం ఇష్టం లేకపోతే చెప్పాలన్నారు. సిట్ తనిఖీపై బీజేపీవారికి ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. ఇప్పటినుంచే ఏదో ప్రచారం ప్రారంభించారన్నారు. సిట్‌ను వ్యతిరేకించడం చూస్తే వారి మనసుల్లో ఏమో ఉండవచ్చని అన్నారు.
అంగళ్లలోకి దూసుకెళ్లిన లారీ
● ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
● తుమకూరు జిల్లాలో ప్రమాదం
తుమకూరు: వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి షాపుల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ టన మంగళవారం తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా కోలాల గ్రామంలో జరిగింది. కొరటగెరె నుంచి యూరియా లోడుతో తుమకూరుకు బయల్దేరిన లారీ అదుపుతప్పి ఎడమవైపు షాపుల్లోకి దూసుకెళ్లింది. బేకరీ, గాజుల అంగడి ధ్వంసమయ్యాయి. వాటిలో ఉన్నవారిలో రంగశామయ్య (62), బైళప్ప (65) అక్కడే మరణించారు. కోలాలవాసి జయన్న, వడెరహళ్ళి కాంతరాజు, కాటనహళ్ళి మోహన్‌కుమార్, హొసపెటె సిద్దగంగమ్మ అనే నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు వస్తువులను కొనడానికి షాపులకు వచ్చినవారే. బాధితులను తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బేకరీ, గాజుల షాపు ధ్వంసమయ్యాయి.
కొండచరియల
సమస్యకు అడ్డుకట్ట
శివాజీనగర: రాష్ట్రంలో 6 జిల్లాల్లో భూమి కుంగిపోవడం, కొండ చరియలు పడిపోతున్న సమస్య ఎక్కువగా ఉంది, ఈ ప్రాంతాల్లో అడ్డుగోడ నిర్మించడానికి రూ.500 కోట్లు కేటాయిస్తామని రెవెన్యూ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. మూడు తీరప్రాంత జిల్లాల్లో సముద్రం వల్ల భూమి కోతను అరికట్టేందుకు ప్రతి జిల్లాకు రూ. వంద కోట్లు చొప్పున కేటాయిస్తామన్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని భూమి కుంగిన ప్రాంతాలకు మంగళవారం ఆయన పరిశీలించారు. కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం కావడంతో వల్ల ప్రకృతి వైపరీత్యాల నివారణ పనులు సాగడం లేదని ఆరోపించారు. దేవిమనఘట్టలో అడ్డుగోడ నిర్మించకుండా రహదారి పనులు చేపట్టినందుకు మండిపడ్డారు.