
జీఎస్టీ నోటీసులతో భయాందోళన
● 24న నిరసన: వ్యాపార సంఘాలు
బొమ్మనహళ్లి: చిరు వ్యాపారులు, ఫుట్‌పాత్ వ్యాపారులకు లక్షల రూపాయల జీఎస్టీ పన్నులు కట్టాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు అశాసీ్త్రయంగా నోటీసులు ఇస్తున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ 24వ తేదీన బెంగళూరు ఫ్రీడం పార్క్‌లో వేలాదిమంది ధర్నా చేస్తామని రాష్ట్ర బేకరి, కాండిమెంట్స్, చిరు వ్యాపారుల సమాఖ్య సభ్యులు తెలిపారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో సమాఖ్య అధ్యక్షుడు డీబీ ప్రతాప్‌శెట్టి మాట్లాడారు. నోటీసులు పంపి, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని వ్యాపారులను భయపెడుతున్నారని ఆరోపించారు. తాము తీవ్ర భయాందోళనలో ఉన్నామన్నారు. గత 4 ఏళ్ల బ్యాంకు లావాదేవీలు, కొనుగోళ్లు, వ్యాపార వివరాలను ఇవ్వాలని ఆదేశించారని, తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రోజూ వ్యాపారం జరిగితేనే తమకు ఉపాధి అని అన్నారు. తమ వద్ద ఎలాంటి దాఖలాలు లేవని, జీఎస్టీ నోటీసులను ఖండిస్తూ గురువారం ధర్నా చేస్తామని తెలిపారు.
పాల వ్యాపారికి రూ.కోటి పన్ను
యశవంతపుర: బెంగళూరులో నందిని పాల బూత్‌ను నడుపుతున్న వ్యాపారి అక్షరాలా రూ.కోటి పన్ను చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ నోటీసులిచ్చింది. ఉళ్లాళలో రవి అనే వ్యక్తి నందిని పాల కేంద్రం పెట్టుకున్నాడు. ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకునేవాడు. అతని లావాదేవీలను పరిశీలించిన పన్ను అధికారులు రూ.కోటి ట్యాక్సులు చెల్లించాలని తాఖీలులివ్వడంతో షాక్ తిన్నాడు.