
హనీట్రాప్ ముఠా గుట్టురట్టు
● నిందితుల్లో ఖాకీలు
మైసూరు: బట్టల షాపు యజమానికి హనీ ట్రాప్ చేసిన యువతితో పాటు మరికొందరిని జిల్లాలోని బైలకుప్పె స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. కవన, సైఫ్ బంధితులు. నెల రోజుల క్రితం పిరియాపట్టణ తాలూకా కంపలాపురకు చెందిన దినేష్ కుమార్ అనే బట్టల వ్యాపారితో కవన చనువుగా ఉంటూ వీడియోలు తీసుకుంది. వాటిని చూపించి రూ.10 లక్షలు ముట్టజెప్పాలని ఒత్తిడి చేశారు. బాధితుడు బైలకుప్పె స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా మరిన్ని సంగతులు బయటపడ్డాయి. పోలీసు కానిస్టేబుళ్లు శివణ్ణ, ఆనంద్, మూర్తిలకు కూడా ఇందులో పాత్ర ఉందని తెలిసి అరెస్టు చేసి జైలుకు తరలించారు. కేరళలోని కణ్ణూరులో ఒక లాడ్జిలో కవన, సైఫ్ ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. అందరూ ముఠాగా ఏర్పడి డబ్బున్నవారిని హనీట్రాప్ అని దోచుకుంటున్నట్లు అనుమానాలున్నాయి. విచారణలో మరిన్ని వాస్తవాలు తెలిసే అవకాశముంది.