
రైతుల ఖాతాలకు త్వరగా డబ్బు జమ చేయండి
బళ్లారిఅర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని తాలూకాలోని రైతులు గత మార్చిలో జొన్నలకు మద్దతు ధర నిర్ణయించిన మేరకు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి ఇప్పటికే జొన్నలను విక్రయించారు. ఇప్పటికే మూడు నెలలు అవుతున్నా సదరు సంబంధించిన డబ్బులు జమ చేయలేదని, తక్షణమే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని కన్నడనాడు రైతు సంఘం సంస్థాపక అధ్యక్షుడు ఈశ్వరప్ప మెణసిన డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల సారథ్యంలో డీసీ కార్యాలయంలో ఆందోళన చేపట్టి అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈశ్వరప్ప మాట్లాడుతూ ఈ సారి డబ్బులు సకాలంలో విడుదల చేస్తే ఖరీఫ్ పంటల సాగుకు రైతులు ఉపయోగించుకుంటారని సూచించారు. ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడంతో మనోస్థైర్యాన్ని రైతులు కోల్పోతున్నారన్నారు. ఇక అప్పులు ఇచ్చిన వారు, బ్యాంక్ అధికారులు రుణాల వసూలుకు రైతుల ఇళ్లకు ప్రదక్షణలు చేస్తున్నారని, దీంతో రైతన్నల బాధలు వర్ణణాతీతం అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి సదరు డబ్బులను త్వరగా రైతుల ఖాతాలో జమా చేయాలని ఆయన జిల్లాధికారికి విజ్ఞప్తి చేశారు. ఒక వేళ ఈ సమస్యలపై స్పందించక పోతే తీవ్ర పోరాటం చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఆ సంఘం ప్రముఖులు రమేష్ గౌడ, దొడ్డ బసన్నగౌడ, శివకుమార్‌గౌడ, వీరభద్రగౌడ, రాజశేఖర్, ప్రశాంత్‌స్వామి, కోటె హరిస్వామి, శివరామ్‌రెడ్డి, అనిల్‌రెడ్డి గోడేహాళ్ తదితరులతో పాటు ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.