
లాభాల బాటలో బీడీసీసీ బ్యాంక్
హొసపేటె: బ్యాంకు గత 48 ఏళ్లుగా నిరంతరం లాభదాయకంగా ఉందని బ్యాంక్ అధ్యక్షుడు కే.తిప్పేస్వామి తెలిపారు. ఆదివారం నగరంలోని వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో బళ్లారి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వార్షికోత్సవ కార్యక్రమంలో అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సంవత్సరం 2024–25లో రూ.12.72 కోట్ల లాభాన్ని ఆర్జించింది. నేటి పోటీ బ్యాంకింగ్ రంగంలో కొత్త తరం బ్యాంకుగా సీబీఎస్ బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు. అన్ని రకాల డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. కర్ణాటకలోని 21 డీసీసీ బ్యాంకులలో యూపీఐ సేవలను ప్రారంభించిన మొదటి డీసీసీ బ్యాంక్ అని తెలిపారు. 2025 మార్చి 31 నాటికి బ్యాంకు ప్రస్తుతం 665 సహకార సంఘాల సభ్యత్వాన్ని కలిగి ఉందని తెలిపారు. రూ.130.30 కోట్ల వాటా మూలధనం, రూ.165.65 కోట్ల రిజర్వ్ ఫండ్‌తో పాటు రూ.130.30 కోట్ల వాటా మూలధనం పొంది ఉందని తెలిపారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సీఆర్‌ఏఆర్ 9 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. బ్యాంక్ సీఆర్‌ఏఆర్ 12.22 శాతం, స్థిరమైన మూలధన నిష్పత్తిని కలిగి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంక్ నేతలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.