
రౌడీ హత్య కేసు.. ఎమ్మెల్యే బంధువు అరెస్టు
యశవంతపుర: గత కొన్నిరోజుల క్రితం బెంగళూరులో రౌడీషీటర్ బిక్లు శివ హత్యకు గురి కాగా, కేఆర్ పుర బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌ను 5వ నిందితునిగా పేర్కొనడం తెలిసిందే. ఆయనను భారతీనగర పోలీసులు విచారించారు. ఇంతలోనే బసవరాజ్ సోదరుని కొడుకు అనిల్‌ను సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. నిందితులకు ఇతడే కారును సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రధాన నిందితుడు జగదీశ్ చాలా బలవంతుడని, నాయకులు, సినీ ప్రముఖులకు సన్నిహితుడని తెలిసింది. నటి రచితా రామ్‌కి ఇతడు చీర, బంగారు నగలను బహుమతి ఇస్తున్న ఫోటో వైరల్‌గా మారింది. నటుడు రవిచంద్రన్, సుదీప్ ఫోటోలూ కూడా వచ్చాయి. జగదీశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటివరకు 7 మంది పట్టుబడినట్లు తూర్పు డీసీపీ డీ దేవరాజ్ తెలిపారు. జగదీశ్ ఆచూకీ లేదు.